బీసీ రుణాలు ఎప్పుడిస్తరు?

 బీసీ రుణాలు ఎప్పుడిస్తరు?

బీసీలు, చేతి వృత్తిదారులకు అండగా ఉంటామని, సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు వివిధ సందర్భాల్లో, ఎన్నికల సభల్లో ప్రకటించారు. కానీ ఆచరణలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. బీసీ రుణాల పేరుతో లక్షల్లో అప్లికేషన్లు తీసుకున్నా.. వేలల్లో కూడా వాటిని శాంక్షన్​ చేయడంలేదు. అసలే కరోనా ఎఫెక్ట్​తో అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా చేతివృత్తిదారుల పరిస్థితి దయనీయంగా మారింది. పూటగడవడమే కష్టంగా మారడంతో పెట్టుబడికి పైసలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీసీ రుణాలపై గంపెడాశ పెట్టుకుంటే.. ప్రభుత్వం వారికి మొండిచేయి చూపిస్తోంది.

ఉపాధి కోసం చిన్న చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు బీసీ వృత్తిదారులు దరఖాస్తు చేసుకుని రుణం ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రుణాలు అందరికీ అందించాలంటే బీసీ బడ్జెట్‌‌‌‌ను పక్కదారి పట్టించకుండా, బీసీలకే ఖర్చు చేస్తే రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ అందుతాయి. మొత్తం బీసీ రుణాల పంపిణీకి రూ.10 వేల కోట్లు సరిపోతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లను బీసీ రుణాలకు సరిపెట్టాలని చూస్తోంది. అందుకే బీసీ రుణాల దరఖాస్తుల పరిశీలన పూర్తిగా పక్కన పెట్టారు. ఈ లోన్లకు సంబంధించి బ్యాంకులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. బ్యాంకులతో లింకు లేకుండా నేరుగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ దఫా సబ్సిడీ శాతం పెంచారు. కానీ పాత పద్ధతిలోనే రుణాల మంజూరుకు సంబంధించిన విధానాలు ఉన్నాయి.

కరోనా కారణంగా ఇబ్బందులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌‌‌‌ విజృంభిస్తోంది. కరోనా మొదటి వేవ్‌‌‌‌ తో అనేక మంది చేతి వృత్తిదారులు రోడ్డునపడ్డారు. రెండో వేవ్‌‌‌‌ తో లక్షలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. వైరస్‌‌‌‌ సోకి అనేక కుటుంబ పెద్దలు మరణించడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఈ కరోనా కల్లోలంలో వృత్తిదారులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద దిక్కుగా ముందుకు రావాల్సి ఉంది. చేతి వృత్తిదారులను కరోనా నుంచి కాపాడుతూ వారు ఆర్థికంగా నిలబడటానికి చేయూత ఇవ్వాల్సి ఉంది. కానీ బీసీ కార్పొరేషన్‌‌‌‌ రుణాల కోసం 2018--–19లో రాష్ట్రవ్యాప్తంగా 5,77,643 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 35 వేల మందికి మాత్రమే లోన్లు మంజూరయ్యాయి. లక్ష రూపాయల రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సగానికి తగ్గించి, 5 వేల మందికి మాత్రం రూ.50 వేల చొప్పున అందించారు. గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో బీసీ రుణాల కోసం 18 వేల మంది దరఖాస్తు చేసుకుంటే వ్యక్తిగత రుణాల కింద 580 మందికే లోన్లు ఇచ్చారు. మిగిలిన 5 లక్షల 42 వేల మందికి ఇప్పటి వరకూ ఒక్క పైసా రుణం అందించలేదు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు.

ఫ్రీ కరెంట్​ స్కీమ్​పై సరైన గైడ్​లైన్స్​ ఇవ్వాలె

వృత్తులపై ఆధారపడే రజక, క్షౌర(నాయీ), కుమ్మరి, విశ్వకర్మ, పూసల, మేదర, దర్జీ, బోయ, సగర(ఉప్పర), వడ్డెర తదితర వృత్తిదారులను ఫెడరేషన్ల ద్వారా ఆదుకున్నది లేదు. ఇటీవల రజకులకు, నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు ఉచిత కరెంటు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం మంచిదే. జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల సందర్భంగా లాండ్రీ, డ్రైక్లీనింగ్‌‌‌‌, దోభీఘాట్లు, సెలూన్లకు ఉచితంగా కరెంటు అందిస్తామని టీఆర్ఎస్​ సర్కారు హామీ ఇచ్చింది. 250 యూనిట్ల వరకు ఉచిత కరెంట్​ ఇస్తామని చెప్పింది. కానీ, ఇది సరిగ్గా అమలుకు నోచుకోవడం లేదు. ఉచిత కరెంట్​ పథకానికి సరైన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ రూపొందించి, అందరికీ ఈ పథకం అందేలా చూడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపైన డబ్బాలు ఏర్పాటు చేసుకొని ఇస్త్రీ చేసుకుంటున్న వారందరికీ కరెంటు మీటర్లు ఏర్పాటు చేసి ఈ పథకాన్ని వర్తింపజేయాలి. సొంత ఇల్లు ఉండి లాండ్రీ షాపులు, షట్టర్లు, అపార్ట్‌‌‌‌మెంట్లలో ఇస్త్రీ షాపులు, చిన్న చిన్న డ్రై క్లీనింగ్‌‌‌‌ షాపులు స్వంతంగా నడిపే వారికీ అమలు చేయాలి. రైతుల వ్యవసాయ భూములకు ఇస్తున్న ఉచిత కరెంట్​ మాదిరిగానే, దోభీఘాట్లన్నింటికీ ఫ్రీ కరెంట్​ను అందించాల్సిన అవసరం ఉంది.

బీసీలను మభ్యపెడుతున్నరు

ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌కు రూ.250 కోట్లు విడుదల చేస్తూ రెండేండ్ల క్రితం జీవో నంబర్​ 99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించి, ఒక్క పైసా కూడా లబ్ధిదారులకు విడుదల చేయలేదు. రజక, నాయీ వృత్తిదారులకు శిక్షణ పేరుతో కొంత మందిని ఆఫీస్‌‌‌‌ల చుట్టూ తిప్పుకొని రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేశారు. మిగిలిన 9 కులాల ఫెడరేషన్లకు రూ.164 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. గ్రామీణ కులవృత్తిదారులు, సంచార, సేవా ఉత్పత్తి వృత్తుల వారికి ఉపాధి కింద బ్యాంకుతో లింకు పెట్టి రుణాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. సంక్షేమ పథకాలతో బీసీలను మభ్యపెడుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల కోసం పలుసార్లు మంత్రులు రుణాల ప్రస్తావన తెచ్చి బీసీలందరికీ రుణాలు ఇస్తామని బాహాటంగా చెప్పారు. కానీ నేటికీ రుణాలు ఇవ్వకుండా బీసీ, ఎంబీసీలను మోసం చేస్తున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతలాగా ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌కు చైర్మన్‌‌‌‌ను ఏర్పాటు చేసి, రూ.వెయ్యి కోట్లు రెండుసార్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఈ నిధులను ఎంబీసీ కోసం ఖర్చు చేయలేదు. బతుకమ్మ చీరలకు, ఇతర వాటికి మళ్లించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంబీసీల పట్ల ఎంత వివక్ష ఉందో అర్థమవుతోంది. 

బీసీలందరినీ ఒకే రీతిన చూడొద్దు

టీఆర్ఎస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలందరికీ రుణాలు మంజూరు చేయాలి. వారి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి. వారికి కేటాయించిన బడ్జెట్‌‌‌‌ను వారికే ఖర్చు చేయాలి. ఇప్పటికే ఉన్న ఫెడరేషన్లకు ఉమ్మడిగాకానీ, విడివిడిగాకానీ కేటాయించిన నిధులను వాటి నుంచి బీసీలు, ఎంబీసీలకు ఏడేండ్లలో పూర్తిగా ఖర్చు చేయలేదు. అలా చేయకుండా దేశంలోనే మా రాష్ట్రం నంబర్‌‌‌‌వన్‌‌‌‌ అంటూ ఊదరగొట్టి మాటలు చెప్పడం కాదు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్‌‌‌‌కు అన్ని హక్కులు ఇచ్చి ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌ను డమ్మీ చేశారు. 112 బీసీ కులాలను ఒకే రీతిలో చూస్తున్నారు. అనేక సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్‌‌‌‌ ద్వారా జనాభా ఆధిక్యత కలిగిన కులాలే లబ్ధి పొందుతున్నాయి. ఇప్పుడు జరగబోయేది కూడా అదే అనే అనుమానం కలుగుతోంది. చిన్న చిన్న కులాల వారికి రాజకీయ నేపథ్యం ఉండదు. అందువల్ల లబ్ధిదారుల ఎంపిక విధానంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులకే రుణాలు దక్కే అవకాశం ఉంది. ఇక్కడ నష్టపోయేది ఎంబీసీలు, సంచార జాతులు, చేతి వృత్తిదారులే. కాబట్టి ఈ కరోనా క్లిష్ట పరిస్థితుల్లో లబ్ధిదారులందరికీ సాధ్యమైనంత వరకూ బీసీ రుణాలు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దరఖాస్తు చేసుకుని లోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి చేతి వృత్తిదారునికి నెలకు రూ.7,500 చొప్పున భృతిగా ఇవ్వాలి. 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించాలి. అప్పుడే వీరందరికీ ఆర్థికంగా చేయూత లభిస్తుంది.
                                                                                                                      - గుమ్మడిరాజు నరేష్‌‌‌‌,రాష్ట్ర అధ్యక్షుడు, రజక వృత్తిదారుల సంఘం