
న్యూఢిల్లీ: మూడు కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి వ్యతిరేకంగా లుకౌట్ నోటీస్ జారీ అయింది. బ్యాంకుల రిక్వెస్ట్ మేరకు దీనిని జారీ చేశారు. యెస్ బ్యాంక్ ప్రమోటర్లతో కుమ్మక్కై అంబానీ గ్రూప్ కంపెనీలు ఈ లోన్‌ను తీసుకున్నాయని, తిరిగి కట్టలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో అంబానీకి సమన్లు జారీ చేశామని తెలిపింది. ఈ నెల ఐదున విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఆర్థిక మోసాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నోటీసు కారణంగా అంబానీ విదేశాలకు వెళ్లడానికి వీలు ఉండదు.
అక్రమంగా నిధులను మళ్లించలేదు: ఆర్ ఇన్‌ఫ్రా
తమ కంపెనీ నిధులను అక్రమంగా మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలను రిలయన్స్ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖండించింది. అనిల్ అంబానీ మూడు సంవత్సరాలకు పైగా, అంటే మార్చి 2022 నుంచి కంపెనీ బోర్డులోనే లేరని స్పష్టం చేసింది. సెబీ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లుగా నిధుల మళ్లింపు రూ.10 వేలు కోట్లు కాదని, రూ.6,500 కోట్లు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఈ మొత్తాన్ని తిరిగి పొందడానికి సెటిల్‌మెంట్ కుదిరిందని పేర్కొంది. సీఎల్ఈ అనే కంపెనీ 'రిలేటెడ్ పార్టీ' అని చెప్పకుండా దాని ద్వారా నిధులు మళ్లించారని సెబీ ఆరోపించింది. రిలయన్స్ ఇన్‌ఫ్రా ఈ విషయాన్ని ఫిబ్రవరి 9న బహిరంగంగా వెల్లడించిందని, ఇది సెబీ కనిపెట్టిన విషయం కాదని కంపెనీ వర్గాలు తెలిపాయి.