గణనాథుడికి రూపాలెన్నో..

గణనాథుడికి రూపాలెన్నో..

పండుగైనా, పబ్బమైనా తొలి పూజ  అందుకునేది గణేశుడే. సకల శుభాలకి మూలం అయిన ఆ గణనాథుడు పుట్టింది ఈరోజే.  నలుమూలలా సంతోషాల్ని పంచే ఈ ఏకదంతుడు 32 రూపాల్లో భక్తులకి దర్శనమిస్తాడు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన రూపాల విశిష్ఠత ఏంటంటే.. 

భక్తి గణపతి

భక్తి గణపతికి నాలుగు చేతులుంటాయి.  కుడి వైపు చేతుల్లో కొబ్బరికాయ, బెల్లం పరమాన్నం , ఎడమ వైపు చేతుల్లో మామిడి పండు, అరటిపండు ఉన్న గిన్నె  పట్టుకుని దర్శనమిస్తాడు భక్తి గణపతి.

తరుణ గణపతి

తరుణ అంటే యవ్వనం. ఈ రూపంలో గణపతికి ఎనిమిది చేతులుంటాయి. అంకుశం, జామపండు, దంతం, చెరుకు గడ , ఉండ్రాళ్ళు​, వెలగపండు గుజ్జు, మొక్కజొన్న కంకి, వల పట్టుకుని కనిపిస్తాడు ఉంటాడు ఈ రూపంలో. 

వీర గణపతి 

వినాయక రూపాల్లో చాలా శక్తి వంతమైంది వీర గణపతి రూపం. ఈ రూపంలో గణపతికి 16 చేతులుంటాయి. బాణం, బేతాళుడు, చక్రం, మంచపు కోడు, గద, పాము, శూలం, గొడ్డలి బొమ్మ ఉన్న జెండా, శక్తి, కుంతమనే, ముద్గరం అనే ఆయుధాలు, విల్లు, ఖడ్గం, అంకుశం, పాశం, విరిగిన దంతంతో దర్శనమిస్తాడు.  

శక్తి గణపతి 

శక్తి గణపతిని పూజిస్తే కష్టం దరిచేరదని పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపంలో నాలుగు చేతులతో కనిపిస్తాడు గణేశుడు. అంకుశం, పాశం, విరిగిన దంతం చేత పట్టుకుని భక్తుల కోర్కెలు తీర్చుతాడు. 

వక్రతుండ 

 ఈ రూపంలో వినాయకుడి తొండం వక్రంగా ఉంటుంది. ఈర్ష్యా, ద్వేషాలను మనసు నుంచి తీసేస్తాడు  వక్రతుండ వినాయకుడు. 

లంబోదర

పెద్ద పొట్టతో ఈ రూపంలో దర్శనమిస్తాడు గణనాథుడు. కోపం, అసూయ, ద్వేషాలని ఈ రూపంలో  తరిమేస్తాడు. 

గజానన

గజానన అంటే ఏనుగు తల అని అర్ధం.  ఈ రూపంలో ఉన్న  వినాయకుడ్ని పూజిస్తే తెలివి తేటలు పెరుగుతాయి. 

నృత్య గణపతి

మనసుకు ప్రశాంతతని  ఇచ్చే ఈ గణపతి చేతులలో పాశం, అప్పాలు, అంకుశం, విరిగిన దంతం ఉంటుంది.

జయ గణపతి  

విజయాల వైపు నడిపించే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి.  పాశం, విరిగిన దంతం, అంకుశం, పండిన మామిడి పండుతో దర్శనమిస్తాడు. 

సిద్ధి గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి.  చేతుల్లో  పండిన మామిడి పండు, పూలగుత్తి, గొడ్డలితో దర్శనమిస్తాడు.