నరసింహావతారంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం

నరసింహావతారంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం

భద్రాచలం, వెలుగు :  ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రాచలం సీతారామచంద్రస్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్బగడిలో సుప్రభాత సేవ నిర్వహించి, గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి అభిషేకం చేసి, తమలపాకులు, అప్పాలు, నిమ్మకాయల మాలలను నివేదించారు. 

హనుమాన్​చాలీసా పారాయణం జరిగింది. ప్రత్యేక పూజల అనంతరం సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను నరసింహావతారంలో అలంకరించి వేదవిన్నపాలు చేశారు. నాళాయర దివ్యప్రబంధ పారాయణం జరిగింది. తర్వాత మిథిలాస్టేడియంలోని వేదికపైకి నృసింహావతార రామయ్యను తీసుకొచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. 

సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. భక్తుల జయజయధ్వానాల మధ్య నరసింహావతార రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. తిరువీధి సేవ తర్వాత విశేషమైన గ్రామపరిక్రమణం ప్రారంభించారు. గోవిందరాజస్వామి ఆలయం నుంచి ముదిరాజ్​బజార్, అంబసత్రం మీదుగా రామాలయానికి స్వామి చేరుకున్నారు. గ్రామానికి రక్షకుడిగా ఉంటానంటూ నరసింహాస్వామి ఈ గ్రామ పరిక్రమణం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భక్తులకు బెల్లం పానకం, వడపప్పు తీర్థప్రసాదంగా పంపిణీ చేశారు. అహోబిలమఠం ఆధ్వర్యంలో భక్తులు కోలాటాలు, భజనలమధ్య తిరువీధి సేవ ఘనంగా జరిగింది.