గండి మైసమ్మ వద్ద తప్పిన పెను ప్రమాదం

గండి మైసమ్మ వద్ద తప్పిన పెను ప్రమాదం

మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గండిమైసమ్మ ప్రధాన రహదారిలో పెను ప్రమాదం  తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో వెనక ఉన్న వస్తున్న స్కూల్ బస్సు సైతం ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు. ఆ రహదారిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో పేరెంట్స్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

గండి మైసమ్మ ప్రధాన రహదారిలోని శ్రీరాం నగర్ కాలనీ వద్ద గ్రానైట్ లోడ్తో వెళ్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. అదే సమయంలో లారీ వెనుక వస్తున్న క్రీక్ ప్లానెట్ స్కూల్ బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సు ముందుభాగంతో పాటు అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదసమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ రోడ్డులో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరెంట్స్ ఆందోళనతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.