మాకు కరోనా ను అంటించండి : వైరస్ కోసం పోటీపడుతున్నారు

మాకు కరోనా ను అంటించండి : వైరస్ కోసం పోటీపడుతున్నారు

ప్రపంచంలో ఎవరైనా సరే కరోనా వైరస్ అంటే భయాందోళనకు గురవుతున్నారు. ఏ చిన్న దగ్గొచ్చినా, జలుబు చేసినా సరే కరోనా సోకిందేమోనన్న అనుమానంతో డాక్టర్లను సంప్రదిస్తున్నారు. కానీ వీళ్లు మాత్రం కరోనా సోకితే బాగుండు అని అనుకుంటున్నారు. అంతేకాదు ఏం చేస్తే మహమ్మారి సోకుతుందో తెలుసుకొని మరీ వాటిని చేసేందుకు పోటీ పడుతున్నారు.

అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అగ్రరాజ్యంలో 1.42మిలియన్ల మందికి కరోనా సోకింది. వారిలో 84,763మంది మరణించారు. 2లక్షల మందికి పైగా కోలుకున్నారు.

అయితే దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దశల వారీగా లాక్ డౌన్ ను ఎత్తేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఆ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి.

మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమెరికాకు చెందిన జైళ్లలో ఖైదీల్ని తాత్కాలికంగా విడుదల చేసేలా నిర్ణయం తీసుకుంది. నిర్ణయంతో లాస్ ఎంజెల్స్ కౌంటీ జైలు అధికారులు కొంతమంది ఖైదీల్ని విడుదల చేశారు. దీంతో మిగిలిన ఖైదీలు  విడుదల చేయాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్ని అధికారులు కట్టడి చేసినా తమని ఎందుకు విడుదల చేయడం లేదంటూ  ఖైదీలు కరోనా వైరస్ సోకేలా వ్యవహరిస్తున్నారు. ఒకరు ధరించిన మాస్క్ లు మరొకరు ధరించడం, ఒకరు తాగిన నీళ్లను మరొకరు తాగడం ఇలా..ఏం చేస్తే కరోనా సోకుతుందో అన్నీ చేస్తున్నారు.

అలా చేయడం వల్ల 30మంది ఖైదీలకు కరోనా సోకింది. కరోనా సోకితే తమని విడుదల చేస్తారని భావించిన ఖైదీలకు జైలు అధికారులు షాకిచ్చారు. చట్ట విరుద్దంగా కరోనా ను వ్యాప్తి చేసేందుకు కుట్ర చేస్తున్నారనే నెపంతో వారిపై అదనంగా కేసులు నమోదు చేశారు.