ఎన్నికల్లో 238 సార్లు ఓడిపోయిండు..మళ్లీ బరిలోకి దిగిండు

ఎన్నికల్లో 238 సార్లు ఓడిపోయిండు..మళ్లీ బరిలోకి దిగిండు
  •  చచ్చేదాక ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న పద్మరాజన్‌‌
  • ఓటమిలోనే తనకు కిక్‌‌ ఉందంటున్న తమిళనాడు వృద్ధుడు 

మెట్టూరు: తమిళనాడుకు చెందిన 65 ఏండ్ల వృద్ధుడు పద్మరాజన్ ఇప్పటివరకు 238 సార్లు వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయినా, మరోసారి ప్రస్తుత లోక్‌‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. ఈయన ఓటములు లిమ్కా బుక్‌‌ రికార్డులకెక్కాయి. ఇన్నిసార్లు ఓడిపోవడం మీకు బాధాగా లేదా అని అడిగితే.. తాను ఓటమిలోనే సంతోషం వెతుక్కుంటానని చెప్తున్నారు. తమిళనాడులోని మెట్టూరుకు చెందిన పద్మరాజన్‌‌కు రిపేర్‌‌‌‌ షాపు ఉంది. 1988లో మొదటిసారి తన స్వగ్రామం నుంచి ఎన్నికల్లో పోటీ చేశాడు. అతను బరిలో నిల్చినప్పుడు అందరూ నవ్వారు. కానీ, ఒక సాధారణ వ్యక్తి కూడా ఎన్నికల్లో పోటీ చేయగలడని ప్రూవ్‌‌ చేయాలనుకున్నాడు.

 అనుకున్నట్టే ఎన్నికల్లో పోటీ చేశాడు. ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని, ఓడిపోయినా సంతోషంగానే ఉంటానన్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానికులు ‘ఎలక్షన్‌‌ కింగ్‌‌’ అని పిలిచే పద్మరాజన్‌‌.. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి రాష్ట్రపతి ఎన్నికల వరకు అనేక ఎలక్షన్స్‌‌లో పోటీ చేశారు. ప్రధాని మోదీ, మాజీ ప్రధానులు వాజ్‌‌పేయి, మన్మోహన్‌‌ సింగ్‌‌ కాంగ్రెస్‌‌ పార్టీ ఎంపీ రాహుల్‌‌ గాంధీ చేతిలో ఓడిపోయారు. 

గెలుపు ముఖ్యం కాదు..

‘‘నా దృష్టిలో ఎన్నికల్లో గెలుపు సెకండరీ. నా ప్రత్యర్థి ఎవరు అనేది పట్టించుకోను. ఎప్పటికైనా ప్రజలు నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. సాధారణ ప్రజలు ఎన్నికల్లో పోటీకి వెనుకాడుతారు. నేను వారికి రోల్‌‌ మోడల్‌‌గా ఉండాలనుకుంటున్నాను. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను” అని పద్మరాజన్‌‌ పేర్కొన్నారు. కాగా, ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతై.. ఇప్పటికే ఆయన రూ.లక్షల్లో కోల్పోయారు. మరోవైపు, ఎన్నికల్లో అత్యంత విజయవంతం కాని అభ్యర్థిగా లిమ్కా బుక్‌‌ ఆఫ్‌‌ రికార్డ్స్‌‌లో స్థానం సంపాదించుకున్నారు. తన చివరి శ్వాస వరకు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే షాక్‌‌ అవుతానని, ఆ ఆనందంలో గుండెపోటు కూడా వస్తుందేమోనని చమత్కరిస్తున్నారు.