
కరోనా కారణంగా థియేటర్స్‌కి వెళ్లడానికి వెనకడుగు వేసే ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి ఆప్షన్‌గా మారాయి. ఎంటర్‌టైన్ చేయడంలో సినిమాలతో వెబ్ సిరీసులు పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే ఎక్కువ సిరీసులు వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుగు సిరీసులూ సత్తా చాటుతున్నాయి. అలా వచ్చి సక్సెస్ అయిన వాటిలో ‘లూజర్’ ఒకటి. అభిలాష్ రెడ్డి రూపొందించిన ఈ సిరీస్ సెకెండ్ సీజన్‌ని జీ స్టూడియోస్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ నిర్మించారు. ఇవాళ్టి నుంచి జీ5లో స్ట్రీమ్ కానున్న సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ప్రియదర్శి మాట్లాడుతూ ‘మంచి కథలు విని వాటితోనే ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నా. అది సినిమానా, వెబ్ సిరీసా అని చూడట్లేదు. ఫస్ట్ సీజన్ కంటే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది రెండో సీజన్’ అన్నాడు. కొన్ని కథలు ఓటీటీలోనే చెప్పాలని, ఇది అలాంటి కథేనని సుప్రియ అన్నారు. కీలక పాత్రలు చేసిన హర్షిత్, శశాంక్, కల్పికా గణేష్, పావని కూడా పాల్గొన్నారు. తమ ‘లూజర్’ మెప్పిస్తాడని నమ్మకంగా చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సిరీస్ ఈసారి కూడా అందరినీ మెప్పిస్తుందో లేదో చూడాలి మరి.