
భారత ఇన్సూరెన్స్ రంగంలో GST మార్పుల కారణంగా ఏజెంట్లు, పంపిణీదారులకు కొత్త కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల లైఫ్, హెల్త్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలపై 18 శాతంగా ఉన్న GSTని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిన తర్వాత.. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు కస్టమర్లకు పన్ను లాభం అందించడానికి ఏజెంట్ కమిషన్‌ను భారీగా తగ్గించాయి. ఈ నిర్ణయాన్ని డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
భారత రిటైల్ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ రూ.40వేల నుంచి రూ.50వేల కోట్లుగా ఉండగా.. అందులో ఏజెన్సీ కమిషన్లు 15–20 శాతం వరకు ఉంటాయి. ప్రభుత్వం GSTని రద్దు చేయడంతో.. ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ లభించడం నిలిచిపోయింది. ఇంతకుముందు ప్రీమియంపై 18 శాతం GST వసూలు చేస్తే టాక్స్ క్రెడిట్ రూపంలో 2.2–2.7 శాతం వరకు పన్ను సడలింపు వుండేది. ఇప్పుడు అది లేకపోవడంతో నష్టాన్ని కొంతమేర భర్తీ చేసుకోవడానికి ఏజెంట్లకు చెల్లించే కమిషన్‌లను తగ్గించినట్లు సంస్థలు పేర్కొన్నాయి.
ఇప్పటికే నివా బుపా, కేర్ హెల్త్, ఐసిఐసిఐ లోంబార్డ్ వంటి కంపెనీలు కమిషన్‌లను 18 శాతం మేర తగ్గించాయి. FY24లో లైఫ్ ఇన్సూరెన్స్ రంగం మొత్తం రూ.24వేల కోట్ల GST చెల్లించిందని.. అందులో రూ.14వేల కోట్లు తిరిగి టాక్స్ క్రెడిట్ రూపంలో కంపెనీలు అందుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ సౌలభ్యం లేకపోవడంతో మొత్తం రూ.15వేల కోట్ల వరకు నష్టం ఎదురవుతుందని బీమా పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికే సుమారు రూ.18వందల కోట్ల మేర టాక్స్ క్రెడిట్ నష్టం వస్తోంది.
కమిషన్ కోతలతో ఏజెంట్ల ఆదాయం భారీగా తగ్గింది. ఉదాహరణకు.. ఎవరైనా గతంలో రూ.1,000 కమిషన్ రూపంలో పొందుతున్నట్లయితే.. ఇప్పుడు వారికి రూ.847 మాత్రమే చెల్లించబడుతోంది. జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఇన్‌టిగ్రేటెడ్ అధ్యక్షుడు ప్రశాంత్ మ్హాత్రే ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది చిన్న మార్పు కాదని.. ఏజెన్సీలు, బ్రోకర్లు, సలహాదారుల వర్కింగ్ క్యాపిటల్‌పై నేరుగా ప్రభావం చూపే చర్య అన్నారు. చిన్న, స్వతంత్ర ఏజెన్సీలు ఈ పరిస్థితిలో నిలదొక్కుకోవడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం రానున్న కాలంలో చిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇన్సూరెన్స్ ప్రాచూర్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. ‘2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్’ లక్ష్యానికి విరుద్ధంగా మారొచ్చన్నారు. దీంతో ఇన్సూరెన్స్ పంపిణీదారులు, ఫెడరేషన్లు కలసి ఐఆర్డీఏఐ, ఆర్థిక మంత్రిత్వశాఖ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని చూస్తున్నాయి.