
జంటనగరాల్లో కాంగ్రెస్ పార్టీ క్రమంగా ఉనికి కోల్పోతున్నది. ఒకప్పుడు సిటీని కంచుకోటగా మార్చుకున్న కాంగ్రెస్ కళావిహీనంగా మారిందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. వరుస పరాజయాలు, గెలిచిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అధికారపార్టీలో చేరడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌ను ఆగమాగం చేశాయి. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారానికి దూరంకావడంతో క్రియాశీలక కార్యకర్తల్లోనూ నిరాశ నిండుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే సిటీలో కాంగ్రెస్ పార్టీ జవసత్వాలను కోల్పోయే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్, వెలుగు :గ్రేటర్ కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోట. సీఎంగా ఎవరూ పనిచేసినా సిటీ నుంచి ఇద్దరికి క్యాబినెట్ లో చోటు దక్కేది. పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాల్లోనూ సిటీ నేతలదే హవా కనిపిస్తుండేది. కానీ కాలం మారింది. అధికారం చేజారిపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కీలక స్థాయి నేతలను పార్టీ మారిపోయారు. దీనికి తోడు సంస్థాగతంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయ లోపంతో పార్టీకి ఉన్న వైభవాన్ని కోల్పోయింది. ఇప్పటికే గ్రేటర్ లో తొలిసారిగా జెండా పాతిన టీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలోపేతం దిశగా అప్పటి నుంచి అడుగులు వేస్తుంది. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా లష్కర్ ఎంపీ కిషన్ రెడ్డికి కట్టబెట్టడంతో ఆపార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని గ్రేటర్ లో ఎదుర్కొంటుంది. మల్కాజిగిరి ఎంపీగా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గెలిచినా సిటీపై అంతగా ప్రభావం చూపలేకపోయింది. దీనికితోడు తెలంగాణలో రెండుసార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి నేతలను కుంగిపోయేలా చేసింది. అదేవిధంగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసిన నేతలంతా ఓటమి పాలైపోవడంతో పార్టీని పటిష్టంగా నడిపించే వారు లేక ఇబ్బంది పడుతోంది.
సిటీ పార్టీని నడిపించేదెవరు..?
సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ దక్కించుకున్నారు. అయినా గత కొంత కాలంగా సిటీ నేతలను ఆదరణను మాత్రం పొందలేకపోయారు. అదేవిధంగా కింది స్థాయి కార్యకర్తల్లో ఉత్తేజపరుస్తూ ముందుండి నడిపించలేకపోతున్నారు. దీంతోపాటు ఎంపీగా పోటీచేసిన రెండుసార్లు ఓడిపోవడం, ముషీరాబాద్ ఎమ్మెల్యేగా పోటీచేసిన తనయుడు అనిల్ కుమార్ యాదవ్ ఓటమితో పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అనిల్‌కుమార్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా ఆమేరకు ప్రభావాన్ని చూపలేకపోతున్నారు. ఇదే సమయంలో సిటీ నేతలకు అండగా ఉండాల్సిన రాష్ట్ర స్థాయి నేతలు కూడా వ్యక్తిగత కారణాలతో అంతగా కలుపుకోకపోవడం గమనార్హం. దాంతో సిటీ కాంగ్రెస్‌ను ముందుండి నడిపించేవారు కరవైపోయారు.
కార్యకర్తల్లో అయోమయం…
సిటీలో ఒకప్పుడు కార్పొరేటర్ నుంచి మొదలు మేయర్ తోపాటు, ఎమ్మెల్యే నుంచి మంత్రి వరకు అన్ని స్థాయిల్లో నేతలు ఉండి సిటీ కాంగ్రెస్‌ను ముందుండి నడిపించేవారు. కానీ గత కొంత కాలంగా పార్టీని పట్టించుకునేవారు లేరు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించే జాతీయస్థాయిలో నేతలు కూడా వ్యవహారిచడంతో సిటీలో పార్టీకి ఆదరణ కరువైంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచినా నేతలు కూడా రాష్ట్ర స్థాయిలో పార్టీ ఓటమిపాలు అయినప్పడు బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ కీలకమైన నేతలు అధికార పార్టీ కండువా వేసుకున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో ఉండే కింది స్థాయి నేతలకు అండగా నిలిచేవారు కరవుయ్యారు. అదేవిధంగా సిటీలో బలమైన ఓటు బ్యాంకు, కేడర్ ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడంతో కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారు.
టీఆర్ఎస్, బీజేపీల దూకుడు..
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉండడంతో గ్రేటర్‌పై తమ పట్టుకోసం దృష్టిపెట్టాయి. క్షేత్రస్థాయి, బూత్ లెవల్ లో బలపడేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రానున్న మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా ఆ రెండు పార్టీలు సభ్వత్య నమోదు, సిటీ పర్యటనలతో బిజీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం స్తబ్ధుగానే ఉంది. ఆ రెండు పార్టీల జోరుకు కళ్లెం వేయడంలో సిటీ కాంగ్రెస్ వెనుకబడింది. అనూహ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ఎదుర్కొంటుందనేది సందేహాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.