
డబ్బు సంపాదనకు, క్రైమ్ చేసేందుకు దుండగులు వాడుతున్న క్రిమినల్ ఇంటెలిజెన్స్ చూస్తుంటే నోరెళ్లబెట్టాల్సిందే. వీళ్లకు ఈ ఐడియాలు ఎక్కణ్నుంచి వస్తాయబ్బా.. అనుకోక తప్పదు. ఎందుకంటే కేటుగాళ్లు అల్లే కథలు అలా ఉంటాయి. హైదరాబాద్ లో జరిగిన అలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రస్ట్ కు కోటి రూపాయల ఫండ్ వచ్చేలా చేస్తామని.. అందుకు ముందుగా రూ.50 లక్షలు ఇవ్వాలని.. బురిడీ కొట్టించి డబ్బుతో పరారయ్యారు దుండగులు.
వివరాల్లోకి వెళ్తే.. మలక్ పేట ముసారాంబాగ్ లో మంచిర్యాలకు చెందిన విజయ్(36) అనే వ్యక్తి సేవా రథ్ అనే ట్రస్ట్ ను నిర్వహిస్తున్నాడు. అతని బలహీనతను ఆసరాగా చేసుకుని అతని నుంచే డబ్బులు కాజేయాలని దుండగులు ప్లాన్ వేశారు. పథకం ప్రకారం తాము రవిందర్, అశోక్ లుగా ఓనర్ విజయ్ తో పరిచయం చేసుకున్నారు.
సేవా రథ్ ఆధ్యాత్మిక ట్రస్ట్ కు కోటి రూపాయల సీఎస్ఆర్ ఫండ్స్ వచ్చేలా చేస్తామని విజయ్ ను నమ్మించారు. హైదరాబాద్ లో పలుచోట్ల రెండు నెలలుగా కలుస్తూ.. కోటి రూపాయలు ట్రస్ట్ కు వస్తాయి అని నమ్మబలికి అందుకు 50 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వాలని చెప్పారు. డబ్బులు రెడీ చేసుకోవాలని రెండు నెలల నుంచి విజయ్ కు సూచించారు.
శుక్రవారం (జులై 05) ముసారాం బాగ్ లోని తన సోదరుడు ఇంటికి 50 లక్షల రూపాయలతో చేరుకున్నాడు విజయ్. ముసారాంబాగ్ కు రావాలని రాత్రి 10 గంటలకు ఆ వ్యక్తులకు ఫోన్ చేసి చెప్పాడు విజయ్. రవీందర్, అశోక్ లు గా పరిచయం చేసుకున్న వ్యక్తులు మూసారాం బాగ్ కు చేరుకున్నారు. మరో ముగ్గురు గుర్తుతెలియని దుండగులతో కలిసి తాము పోలీసులమని చెప్పి బెదిరించి 50 లక్షల రూపాయల డబ్బుతో ఉడాయించారు. దీంతో విజయ్ మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.