
గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ కళాశాలలో ర్యాగింగ్ కలకలంపై ఎయిమ్స్ అధికారులు స్పందించారు. ర్యాగింగ్ పాల్పడిన 13 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు. నలుగురు విద్యార్థులపై 18 నెలలపాటు సస్పెన్షన్ విధించగా.. మరో 9 మందిపై 12 నెలల సస్పెన్షన్ విధించినట్లు తెలిపారు.
ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమేకారణమని చెప్పారు అధికారులు. సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు వీడియో తీయడ మే ప్రధాన కారణమని చెప్పారు. సస్పెన్షన్ అయిన విద్యార్థులకు పాతికవేలు జరిమానా విధించడంతో పాటు ఐదు సంవత్సరాలపాటు హాస్టల్ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు మళ్లీ కళాశాలకు రావాలంటే.. సత్ప్రవర్తన కలిగిన సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలంటూ కండిషన్స్ పెట్టారు ఎయిమ్స్ అధికారులు.
గత నెల (జూన్) 22న వసతి గృహంలో తన స్నేహితుడితో మాట్లాడుతుండగా సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డిన ఘటన గురించి తెలిసిందే. సీనియర్ విద్యార్థులు జూనియర్ ని ర్యాగింగ్ చేయడంతో.. ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకున్నాడు. ఈ ఘటనపై అదే రోజు ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లింది. యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణలో ప్రాథమికంగా 15 మందిని బాధ్యులుగా తేల్చారు. దీంతో గతనెల 24న బాధ్యులైన 15 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
ఆ తర్వాత జరిపిన విచారణలో 13 మంది పాత్ర మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఆ 13 మందిని సస్పెండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అందులో నలుగురు విద్యార్థులపై 18 నెలలపాటు సస్పెన్షన్ విధించగా.. మరో 9 మందిపై 12 నెలల సస్పెన్షన్ విధించారు.