- పరిచయస్తుడు తీసుకున్న అప్పుకు జమానత్ సంతకం పెట్టిన వ్యక్తి
- అప్పు తీసుకున్న వ్యక్తి ఐపీ పెట్టడంతో మధ్యవర్తిపై ఒత్తిడి పెంచిన ప్రభుత్వ టీచర్
- రూ. 3 లక్షల అప్పుకు రూ. 5 లక్షలు కట్టినా ఆగని వేధింపులు
- పురుగుల మందు తాగి ఆత్మహత్య
- టీచర్ ఇంటి ఎదుట బంధువుల ఆందోళన
వరంగల్, వెలుగు : పరిచయం ఉన్న వ్యక్తి తీసుకున్న అప్పుకు పెట్టిన ష్యూరిటీ ప్రాణాల మీదకు తెచ్చింది. అప్పు తీసుకున్న వ్యక్తి ఐపీ పెట్టి వెళ్లిపోవడంతో అప్పు ఇచ్చిన సర్కార్ టీచర్ మధ్యవర్తిని వేధించడం మొదలుపెట్టాడు. రూ. 3 లక్షల అసలుకు వడ్డీతో కలిసి రూ. 5 లక్షలు కట్టినప్పటికీ ఇంకా రూ. 5 లక్షలు కట్టాలని వేధిస్తుండడంతో మధ్యవర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ నగరంలో ఆదివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండ బస్ డిపో సమీపంలోని గోకుల్‌నగర్‌లో మాశెట్టి రాంబాబు (50) కిరాణ షాపు నడుపుతూ జీవిస్తున్నాడు. ఇతడికి కొన్ని రోజుల కింద ప్రైవేట్ ఫైనాన్స్ నడిపే, గవర్నమెంట్ టీచర్ రమేశ్ పరిచయం అయ్యాడు.
వీరిద్దరికీ తెలిసిన విష్ణు అనే వ్యక్తికి రమేశ్ ఐదేండ్ల కింద రూ. 3 లక్షలు అప్పు ఇచ్చాడు. ఈ టైంలో రాంబాబుతో ష్యూరిటీ సంతకం పెట్టించుకున్నాడు. విష్ణు ఐపీ పెట్టి వెళ్లిపోవడంతో రమేశ్ డబ్బుల కోసం మధ్యవర్తిగా సంతకం పెట్టిన రాంబాబును వేధించడం మొదలు పెట్టాడు. దీంతో రాంబాబు రూ. 5 లక్షలు చెల్లించాడు. అయితే అసలు, వడ్డీ కలిపి రూ.20 లక్షలు అయిందని, మిగతా డబ్బులు కూడా కట్టాలంటూ రమేశ్ ఓ లీడర్ ఎస్కార్ట్ డ్రైవర్‌గా పనిచేసే తన బావ ఉపేందర్‌తో కలిసి రాంబాబుపై ఒత్తిడి పెంచాడు.
వేధింపులు తట్టుకోలేక రాంబాబు ఈ నెల 16న ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. 17న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంబాబు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం రాత్రి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు బంధువులు ఆదివారం మధ్యాహ్నం రాంబాబు డెడ్‌బాడీతో టీచర్ రమేశ్ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచే కదిలే ప్రసక్తే లేదని పట్టుపట్టారు.