దివ్యాంగుల సంక్షేమ శాఖకు.. వచ్చే బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 33 జిల్లాల్లో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వారికి ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రెట్టింపు చేయాలని, బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే త్వరలోనే ఉద్యమానికి సిద్ధమవుతామని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు.
మలక్ పేటలోని దివ్యాంగుల సంక్షేమశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద లూయిస్ బ్రెయిలి విగ్రహానికి మందకృష్ణ మాదిగ పూలమాల వేసి నివాళులు అర్పించారు. లూయిస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ద్వారా ఆయన పేరు మీద పార్కులు, విగ్రహాలను ఏర్పాటు చేశారని అన్నారు. లూయిస్ బ్రెయిలీ విగ్రహావిష్కరణకు సీఎం కేసీఆర్ వస్తే బాగుండేదన్న ఆయన... వచ్చే లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుకావాలని అన్నారు.