శేఖర్ కమ్ముల నన్ను రిజెక్ట్ చేశారు

శేఖర్ కమ్ముల నన్ను రిజెక్ట్ చేశారు

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’తో మ్యూజిక్ డైరెక్టర్‌‌‌‌గా పరిచయమవుతున్నాడు సీహెచ్‌‌ పవన్. అతను కంపోజ్ చేసిన పాటలు ఇప్పటికే రికార్డులు బద్దలు కొడుతున్నాయి. త్వరలో సినిమా కూడా రిలీజ్ కానున్న సందర్భంగా కాసేపు ఇలా ముచ్చటించాడు పవన్.

‘‘మా తాతయ్య సి.నాగేశ్వరరావు, నాన్న విజయ్ సి కుమార్ సినిమాటోగ్రాఫర్స్. కానీ ఫ్రెండ్స్ కారణంగా నాకు మ్యూజిక్‌‌పై ఇంటరెస్ట్ పెరిగింది. హైదరాబాద్‌‌లో రెండేళ్లు కీబోర్డ్ నేర్చుకుని, తర్వాత చెన్నైలో కేఎమ్‌‌ మ్యూజిక్ కన్జర్వేటరీలో వెస్టర్న్‌‌ క్లాసికల్ డిప్లొమా చేశాను. అన్ని రకాల మ్యూజిక్ అక్కడ నేర్చుకున్నాను. ఆ కాలేజ్ ఫైనల్ డే సెలెబ్రేషన్స్‌‌లో ఓ డ్రామాకి మూడు పాటలు కంపోజ్ చేశాను. ఆ ఈవెంట్‌‌కి వచ్చిన రెహమాన్ ఇంప్రెస్ అయ్యి నన్ను డిన్నర్‌‌‌‌కి పిలిచారు. నా ట్యూన్స్ మరికొన్ని విన్నాక తన దగ్గర చాన్స్ ఇచ్చారు.  మామ్, సర్కార్, 2.0, మెర్సల్, నవాబ్, ద ఫకీర్ ఆఫ్ వెనిస్ చిత్రాలకు ఆయన దగ్గర వర్క్ చేశాను. శేఖర్ కమ్ముల సినిమాకి పని చేయాలని ఎప్పటి నుండో ట్రై చేస్తున్నా. ‘ఫిదా’కి ట్రై చేస్తే రిజెక్ట్ చేశారు. డిఫరెంట్ జానర్స్‌‌లో పది పాటలు కంపోజ్ చేసి చూపిస్తే ఈ సినిమాకి చాన్సిచ్చారు. స్టోరీ కాకుండా ముందు సిచ్యుయేషన్స్, అందుకు దారితీసిన పరిస్థితులు చెప్తారాయన. ఇన్‌‌స్పైర్‌‌‌‌ అయ్యాక సాంగ్ కంపోజ్ చేయమంటారు. జానపద సాహిత్యం అంటే శేఖర్‌‌‌‌కి ఎంతో ఇష్టం. ‘సారంగదరియా’ లాంటి పాటలకు మరింత గుర్తింపు  తీసుకు రావాలంటారు. ఆ పాట గురించి గొడవ జరిగినప్పుడు నేను చెన్నైలో బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను. టైటిల్స్‌‌లో ట్రెడిషనల్ మ్యూజిక్ అని క్రెడిట్ ఇచ్చాం. ఇంటెన్స్ మూవీ కావడంతో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎక్కువ చాలెంజింగ్‌‌గా అనిపించింది. చాలా వెర్షన్స్ ట్రై చేశాను. దీని తర్వాత కొన్ని అవకాశాలొచ్చాయి. ఇంకా దేనికీ కమిటవలేదు. ఇంటర్నేషనల్ రేంజ్‌‌లో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలనేది యాంబిషన్. దానిపై వర్క్ చేస్తున్నాను. నాకు హై బీట్, మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం. తెలుగులో వివేక్ సాగర్ మ్యూజిక్ అంటే ఇష్టం. ‘భీమ్లా నాయక్’ కోసం తమన్ చేసిన సాంగ్ కూడా చాలా నచ్చింది.’’