ప్రేమ ఫలించలేదని పెళ్లే చేసుకోని బాలీవుడ్ నటి

ప్రేమ ఫలించలేదని పెళ్లే చేసుకోని బాలీవుడ్ నటి

వెండితెర మీద కనిపించే  ప్రేమకథలు అందరికీ తెలుసు. కానీ తెర వెనుక కూడా కొన్ని నిజ జీవిత కథలుంటాయి. వాటిలో కొన్ని సుఖాంతమైతే.. మరికొన్ని మాత్రం అర్థాంతరంగా ముగిసిపోతాయి. బాలీవుడ్ నటి సురయ్యా ప్రేమకథ కూడా అలాంటిదే. ఓ హీరోను ప్రేమించింది.. పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. కానీ పెద్దలు ఒప్పుకోకపోవడంతో మనసు చంపుకుంది. వేరొకరి సొంతం కాలేక బతుకంతా ఒంటరిగానే గడిపింది. 

నటిగా.. సింగర్గా..

1929 జూన్ 15 న ముంబైలో జన్మించారు సురయ్యా. ‘మేడమ్ ఫ్యాషన్’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన సురయ్యాకు ‘తాజ్‌మహల్‌’ సినిమాలో ముంతాజ్‌ పాత్ర చెప్పలేనంత పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవాల్సి రాలేదు. నటిగానే కాదు.. సింగర్ గానూ ఆమె క్రేజ్ పెరిగిపోయింది. రాజ్‌ కపూర్, మదన్‌ మోహన్‌ సురయ్యాకు బాల్య స్నేహితులు. వాళ్లతో కలిసి ఆలిండియా రేడియో ప్రోగ్రామ్స్​ చేసేవారామె. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మొదటిసారిగా ‘నయీ దునియా’ అనే మూవీలో పాట పాడిన ఆమె.. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రం అందించారు. యాక్టర్ గా తన అందంతో.. సింగర్ గా స్వరమాధుర్యంతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. అంతటి అందగత్తె మరెవరూ లేరంటూ ‘మాల్లికా ఏ హుస్న్‌’  అని కితాబిచ్చారు. అంటే క్వీన్ ఆఫ్ బ్యూటీ అని అర్థం. ఆమె గొంతు విన్న  జవహర్ లాల్ నెహ్రూ మీర్జా గాలిబ్ ఆత్మ బతికించిందంటూ ప్రశంసించారు. 

జీవితాన్ని మలుపుతిప్పిన ప్రేమ

సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో సురయ్యా సినీ కెరీర్ నే కాదు.. ఏకంగా జీవితాన్నే మలుపుతిప్పింది ప్రేమ అనే రెండక్షరాల పదం. హీరో దేవానంద్ తో ప్రేమలో పడ్డ ఆమె.. ఆయన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించాలనుకుంది. 1949లో ‘జీత్’ సినిమాకి పని చేస్తున్న సమయంలో  ఓ రోజు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ సురయ్యా అమ్మమ్మ బాద్షా బేగం అడ్డుపడ్డారు. వేరే మతస్థుడితో ప్రేమేంటని ఆమెను బలవంతంగా లాక్కెళ్లి ఇంట్లో ఖైదు చేశారు. అమ్మమ్మ మాట కాదనలేక.. దేవానంద్ ను వదలుకోలేక నలిగిపోయిన సురయ్యా చివరకు కట్టుబాట్లకు తలవంచి ప్రేమను త్యాగం చేశారు. ప్రేమకు గుర్తుగా దేవానంద్‌ ఇచ్చిన ఉంగరాన్ని సముద్రంలో విసిరేశారు. 

కట్టుబాట్ల కోసం ప్రేమ త్యాగం

అమ్మమ్మకిచ్చిన మాట కోసం ప్రేమను వదులుకున్నా సురయ్యాకు స్వేచ్ఛ దొరకలేదు. షూటింగ్ కు వెళ్లాలంటే కాపలా. రొమాంటిక్ సీన్లు చేయొద్దని, కళ్లలో కళ్లు పెట్టి చూడొద్దని ఎన్నో ఆంక్షలు. ఫోన్‌లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేశారు.  24గంటలు అమ్మమ్మ తన చుట్టూ తిరుగుతూ అనుమానపు కళ్లతో చూస్తుంటే తట్టుకోలేకపోయారు. ఈ ప్రపంచంలో ప్రేమ కంటే గొప్ప మతం లేదని, భయపడొద్దని తనతో వచ్చేయాలని దేవానంద్‌ చెప్పినా సురయ్యా ధైర్యం చేయలేకపోయారు. సంప్రదాయాలు, కట్టుబాట్ల కోసం ఎంతకైనా తెగించే తన అమ్మమ్మ వల్ల దేవానంద్ కు ఏమైనా అవుతుందేమోనన్న భయంతో తనను మర్చిపోవాలని ఆయనకు చెప్పేశారు. 

చివరి శ్వాస వరకు 

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సురయ్యా, దేవానంద్ పెళ్లి చేసుకోవడం ఆమె తల్లి ముంతాజ్ కు ఇష్టమే. కానీ పెద్దలకు ఎదురు చెప్పలేక కూతురి సంతోషాన్ని బలిపెట్టారు. అయితే వాళ్లిద్దరూ చివరిసారి కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది ముంతాజ్ కావడం విశేషం. కొన్నాళ్లకు దేవానంద్ కల్పనా కార్తీక్‌ను పెళ్లి చేసుకున్నాడు. కానీ సురయ్యా మాత్రం మరొకరిని తన భర్తగా ఊహించుకోలేకపోయింది. తన జీవితంలో ప్రేమ, పెళ్లి దేవానంద్తోనే అయిపోయాయని మానసికంగా నిర్ణయించుకున్నారామె.  అందుకే ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చేందుకు మనసొప్పలేదు. దీంతో ఒంటరిగానే మిగిలిపోవాలని డిసైడ్ చేసుకున్నారు. జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోయారు. 74ఏళ్ల వయసులో ప్రియుడు దేవానంద్ ను తలుచుకుంటూ కన్నుమూశారు.