ప్రేమవ్యవహారం..తల్లీకొడుకులపై దాడి

ప్రేమవ్యవహారం..తల్లీకొడుకులపై దాడి

కరీంనగర్/చిగురుమామిడి, వెలుగు:  ప్రేమ వ్యవహారంలో యువతి బంధువులు యువకుడిపై, అతని తల్లిపై కత్తితో  దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు . కరీంనగర్ జిల్లా  చిగురుమామడి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న గడ్డం చందు(21) హైదరాబాద్ లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.  జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిలుకవాడలో  నందిత (20)  కు ఏడాది కిందటే  ఆమె మేనబావతో వివాహమైంది. కానీ చందు, నందిత అప్పటికే ప్రేమలో ఉండడంతో నందిత తన భర్తతో ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. ఇటీవలే వారు విడాకులు తీసుకున్నారు. 13న నందిత ఇంట్లోంచి వెళ్లిపోయి హైదరాబాద్​లో చందూను పెళ్లి చేసుకుంది. అక్కడే  3రోజులు ఉన్నారు. నందిత, చందూ అన్నదమ్ముల పిల్లలే కావడంతో వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.  వారి ఆచూకీ తెలుసుకున్న నందిత  తరఫు బంధువులు హైదరాబాద్ కు  వచ్చి ఆమెను  జగిత్యాలకు తీసుకెళ్లారు.  రెండు రోజుల కిం ద కరీంనగర్​లోనే ఇరు కుటుంబాల పెద్ద మనుషులు కలిసి పంచాయితీ పెట్టారు. నందితను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా తీసుకెళ్తుంటే పెద్ద మనుషులు ఆపి చందు కుటుంబం వెంట పంపించారు.  

మొదటి భర్తతో కలిసి అటాక్ చేసిన అన్న

చెల్లె  ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టంలేని నందిత  అన్న వెంకటరమణ అలియాస్ రాజు.. మొదటి భర్త ప్రేమ్​ అలియాస్ చింటూతో కలిసి చందూను హత్య చేసేందుకు ప్లాన్ వేశా డు. బుధవారం సాయంత్రం 6గంటల ప్రాంతంలో  ఇద్దరూ కలిసి  బండిపై చందూ ఇంటికి వెళ్లారు.  ఇంటి ముందున్న చందూపై రాజు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. అడ్డు వచ్చిన చందూ తల్లి స్వప్నను కడుపులో తన్ని, ఆమెపైనా కత్తితో దాడిచేసి గాయపరిచాడు. అనంతరం ఇద్దరూ పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న బాధితులను స్థానికులు కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చందూను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తండ్రి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.