షోరూమ్​లు దాటని కార్లు, బైకులు

షోరూమ్​లు దాటని కార్లు, బైకులు

న్యూఢిల్లీ: ప్యాసింజర్‌ వెహికిల్‌ కంపెనీలకు గత నెల కూడా కలిసి రాలేదు. వరుసగా తొమ్మిదో నెలలోనూ అమ్మకాలు పడిపోయాయి. గత జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో వీటి అమ్మకాలు 30.9 శాతం తగ్గి 200,790 యూనిట్లుగా నమోదయ్యాయి. కమర్షియల్‌ వెహికిల్స్‌ అమ్మకాలు 25.7 శాతం తగ్గి 56,866 యూనిట్లకు చేరాయని సొసైటీ ఆఫ్ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మానుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) డేటా వెల్లడించింది. బైకులు, స్కూటర్ల సేల్స్‌ 16.8 శాతం తగ్గి 15 లక్షల యూనిట్లుగా రికార్డయ్యాయి. ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు 36 శాతం పడిపోయి 122,956 యూనిట్లకు చేరాయి. దేశీయంగా ప్యాసింజర్ వెహికిల్స్ తయారీ గత నెలలో 17 శాతం తగ్గిందని సియామ్‌ లెక్కలు తెలిపాయి. ‘‘ఆటోమొబైల్‌ రంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉందని సియామ్‌ డేటా చూస్తే అర్థమవుతుంది. ఈ రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. అమ్మకాలు పెంచుకోవడానికి ఇండస్ట్రీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. అయితే, ప్రభుత్వం సాయం చేయకుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది’’ అని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మథుర్‌ అన్నారు. మనదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్‌ కంపెనీ మారుతీ సుజుకీ మార్కెట్‌ వాల్యుయేషన్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 18.3 శాతం తగ్గింది. బాంబే స్టాక్‌ ఎక్సేంజీలో ఆటో సెక్టర్‌ ఇండెక్స్ 23 శాతం పతనమయింది.

ఎందుకీ దుస్థితి ?

వాహనాలు కొనేవారి సంఖ్య తగ్గుతుండటం ఒక సమస్య అయితే కొనేవారికి ఫైనాన్స్‌ దొరక్కపోవడం మరో సమస్య . ఆర్థిక వ్యవస్థ కూడా నెమ్మదించడం ఆటోమొబైల్‌ రంగంపై ప్రభావం చూపుతోంది. వెహికిల్‌ షోరూమ్‌లు వెలవెలబోతున్నాయి. దీంతో డీలర్లు ఉద్యోగుల సంఖ్యను విపరీతంగా తగ్గిస్తున్నారు. గత మూడు నెలల్లో దేశవ్యాప్తంగా రెండు లక్షల మందిని తొలగించారు. ఇప్పట్లో ఆటోమొబైల్‌ రంగం కోలుకునే అవకాశాలు లేవు కాబట్టి మరిన్ని షోరూమ్‌లు మూతబడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మరింత మంది ఉపాధి కోల్పోవడం తప్పదని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కోరింది. లేకపోతే ఆటోమొబైల్‌ పరిశ్రమ కోలుకోవడం అసాధ్యమని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నుంచి జూలై వరకు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఫాడా ప్రెసిడెంట్‌ ఆశిష్‌ హర్షరాజ్​ చెప్పారు. ‘‘ఉద్యోగాలు కోల్పోయిన వారిలో సేల్స్‌ సిబ్బందే ఎక్కువ. పరిస్థితి ఇలాగే కొనసాగితే టెక్నికల్‌ సిబ్బందిపైనా వేటేయడం తప్పకపోవచ్చు. ఎందుకంటే అమ్మకాలు తక్కువైతే, సర్వీసింగ్‌ అవసరాలూ తగ్గుతాయి’’ అని ఆయన వివరించారు. మనదేశంలో దాదాపు 15 వేల మంది డీలర్లు 26 వేల షోరూమ్‌లను నడుపుతున్నారు. వీటిలో 25 లక్షల మంది పనిచేస్తున్నారు.