RinkuSingh: గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసి వ్యక్తి కొడుకు ఐపీఎల్ స్టార్

RinkuSingh: గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసి వ్యక్తి కొడుకు ఐపీఎల్ స్టార్

రింకూ సింగ్..ఇప్పుడే దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఒక్క మ్యాచుతో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్శించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో వరుసగా ఐదు సిక్సులు బాది...కోల్ కతాను గెలిపించిన రింకూ సింగ్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజా క్రికటర్లు, మాజీ క్రికెటర్లు.. బాలీవుడ్ నటులు అతని బ్యాటింగ్ కు ఫిదా అయ్యారు. 

బాలీవుడ్ ప్రశంసలు

షారుక్ ఖాన్  రింకూ సింగ్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌కి ఫిదా అయిపోయాడు. ‘జూమే జో రింకూ.. మై బేబీ రింకూ ఇలాగే దూసుకుపో... అంటూ పఠాన్ పోస్టర్‌లో రింకూ సింగ్ ఫోటోని జోడించి పోస్ట్ చేశాడు.  దీనికి స్పందించిన రింకూ సింగ్,..షారుక్ సర్ యార్..లవ్ యూ సర్ అండ్ మీ సపోర్ట్‌కి థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చాడు.  షారుక్ పోస్ట్ను బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అనుసరించాడు. ట్విట్టర్‌లో “రింకూ !!!!రింకూ!!!!రింకూ!!!! యే క్యా థా, అంటూ మెచ్చుకున్నాడు. షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్   తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో 'మృగం' అంటూ రింకూ సింగ్ ను సంబోధించాడు. రింకూ సింగ్ ఇన్నింగ్స్‌కి కేకేఆర్ యజమాని షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ఫుల్ ఇంప్రెస్ అయింది....నమ్మలేకపోతున్నా..ఇది Unreal!!!’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

కుటుంబ సభ్యుల ఆనందం..

రింకూ సెన్సెషనల్ ఇన్నింగ్స్ తో అతని స్వస్థలమైన ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో సంబరాలు నెలకొన్నాయి. రింకూ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రింకూ ఇన్నింగ్స్ తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని అతని తమ్ముడు జీతూ సింగ్ తెలిపాడు. రింకూ  మంచి బ్యాట్స్మన్  అయినా...చివరి ఓవర్ లో 29 పరుగులు అవసరమైన పరిస్థితిలో అతని సాధిస్తాడా లేదా అని సందేహం ఉందన్నారు. అయితే  భోలేనాథ్ కృపా, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భయ్యా సంకల్పంతో  ఇది సాధ్యమైందన్నాడు. అతని ప్రదర్శన పట్ల తనతో పాటు..తమ కుటుంబం మొత్తం గర్విస్తున్నామన్నారు.  రింకూ సింగ్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాడని..తెల్లవారుజామునే మేల్కోవడం, రన్నింగ్, జిమ్ చేయడం, ప్రాక్టీస్ చేయడం,  డైటింగ్ చేయడం వంటి పాటిస్తూ..ఈ ఉత్తమ క్రికెటర్ గా ఎదిగాడని చెప్పాడు. అన్నయ్యే తనకు రోల్ మోడల్ అని చెప్పుకొచ్చాడు. 

రింకూ కుటుంబ నేపథ్యం..

రింకూ వ్యక్తిగత జీవితం సినిమా తలపిస్తుంది. కష్టాల సుడిగుండంలో నుంచి క్రికెటర్ గా ఎదిగే వరకు అతని జీవితం ఓ చిత్రం వంటిది.  ఉత్తర ప్రదేశ్‌లోని అలీగఢ్‌ రింకూ సింగ్ స్వస్థలం. అతడి తండ్రి ఖన్‌చంద్ర సింగ్ LPG గ్యాస్‌ సిలిండర్లను ఇండ్లకు డెలివరీ చేసేవారు. చంద్ర సింగ్‌కు ఐదుగురు సంతానం.  రింకూ మూడోవాడు. చంద్ర సింగ్‌కు అలీగ్ స్టేడియానికి సమీపంలో గ్యాస్ కంపెనీ ఇచ్చిన రెండు గదుల క్వార్టర్‌లోనే రింకూ బాల్యం గడిచింది. రింకూ పెద్దన్న ఆటో నడిపేవాడు. మరొకరు కోచింగ్ సెంటర్లో పని చేస్తారు. రింకూ సింగ్‌కు చదువు పెద్దగా అబ్బలేదు. అతను 9వ తరగతి ఫెయిల్ అయ్యాడు. కుటుంబం అప్పులపాలు కావడంతో స్వీపర్‌ ఉద్యోగం సంపాదించైనా సరే కుటుంబానికి అండగా నిలవాలని రింకూ సింగ్ ఓ దశలో భావించాడు. కానీ ఆ తర్వాత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు.

తండ్రి కోసం బైక్ గిఫ్ట్..

రింకూ చదువులో రాణించకపోయినా...క్రికెటర్ గా ఎదగాలన్న లక్ష్యంతో కోచింగ్ తీసుకున్నాడు. బ్యాట్ పట్టుకునే విధానం అందరి కంటే భిన్నంగా ఉండేది. అయితే అతని తండ్రి ఖన్ చంద్ర సింగ్ రింకూను చదువుకోవాలని పలుమార్లు తిట్టేవాడు. చదువుపై కాకుండా క్రీడలు ఆడినందుకే అతని తండ్రి అనేక మార్లు కొట్టాడు. అయినా రింకూ క్రికెట్ ను వదల్లేదు. అయితే ఒక టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు రింకూ ఒక బైక్‌ను గెలుచుకున్నాడు. ఆ బైక్ ను గ్యాస్ డెలివరీలు చేస్తున్న తండ్రికి సహాయం చేయడానికి ఇచ్చాడు. ఈ సమయంలో క్రీడల పట్ల అతడికి ఉన్న మక్కువకు తండ్రి ఫిదా అయ్యారు. అప్పటి నుంచి రింకూను తిట్టడం మానేశారు. 

దేశవాలీలో ఎంట్రీ..

ఉత్తరప్రదేశ్‌లోని అండర్‌-16, అండర్‌-19, అండర్‌-23 సెంట్రల్‌ జోన్‌లకు ప్రాతినిధ్యం వహించిన రింకూ సింగ్..2014 మార్చిలో 16 ఏళ్ల వయసులో అతడు యూపీ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2016--17 రంజీ సీజన్లో ఉత్తర ప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2018--19 రంజీ సీజన్లో గ్రూప్ దశలో 9 మ్యాచ్‌లు ఆడి 803 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో పది మ్యాచ్‌ల్లో అతడు 953 పరుగులు చేశాడు.  అయితే ఇప్పటికే 2017లో కింగ్స్ XI పంజాబ్ రింకూను బేస్ ధర రూ. 10 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ తుది జట్టులో స్థానం మాత్రం దక్కలేదు. ఆ తర్వాత 2018 ఐపీఎల్ వేలంలో రింకూ సింగ్ కోసం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. అయితే  రూ.80 లక్షలకు కోల్‌కతా దక్కించుకుంది. వేలంలో తాను కేవలం  రూ.20 లక్షలకే అమ్ముడుపోతానని రింకూ భావించాడట. కానీ అనూహ్యంగా రూ.80 లక్షల ధర పలకడం సంతోషానిచ్చిందని అప్పట్లో చెప్పాడు.  వేలంలో అమ్ముడుపోయాననే వార్త తెలియగానే.... ఆ డబ్బుతో పెద్దన్నయ్య పెళ్లికి తన వంతు సాయం చేయొచ్చనిపించిందట. చెల్లి పెళ్లికి కూడా కొంత నగదు దాయొచ్చు అనుకున్నాడట. ఓ మంచి ఇంట్లోకి మారాలని భావించానని.. రింకూ సింగ్ తెలిపాడు. రింకూ సింగ్ ను రూ. 80 లక్షలకు కోల్ కతా కొనుగోలు చేయడంతో అతని తండ్రి ఖన్ చంద్ర సింగ్ డెలివరీ మ్యాన్‌ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఒక్క మ్యాచ్ తో వెలుగులోకి..

2021లో గాయం కారణంగా ఐపీఎల్‌కు రింకూ సింగ్ దూరమయ్యాడు. అయితే 2022 ఫిబ్రవరిలో కోల్‌తా అతణ్ని మరోసారి వేలంలో కొనుగోలు చేసింది. ఆ సీజన్లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లో 42 పరుగులు చేసి  తొలిసారి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు.  ఈసారి గుజరాత్‌పై వరుసగా ఐదు సిక్సులు బాదిన రింకూ సింగ్ క్రికెట్ ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు.