
పాకిస్తాన్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌పై ఇజ్రాయెల్ భారీ డ్రోన్ దాడి చేసింది. ఈ విషయాన్నీ పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ప్రకటించారు. డ్రోన్ దాడి తర్వాత యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ట్యాంకర్‌లో ఉన్న 24 మంది పాకిస్తాన్ సిబ్బందిని బందీలుగా చేసుకున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న యెమెన్ తీరంలో జరిగిన ఈ దాడి తరువాత ఆయిల్ ట్యాంకర్ హౌతీల నియంత్రణలో ఉందని తెలిపారు. 27 మంది సిబ్బందితో వెళ్తున్న ఈ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ట్యాంకర్ షిప్ డ్రోన్ దాడి తరువాత మంటల్లో చిక్కుకుంది.
ట్యాంకర్‌లో 24 మంది పాకిస్తానీలు, ఇద్దరు శ్రీలంక పౌరులు, ఒక నేపాలీ ప్రయాణికులు ఉన్నారని తెలిపింది. పాకిస్తాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ ప్రకారం, ట్యాంకర్‌పై ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేయడంతో మంటలు చెలరేగి గ్యాస్ ట్యాంకుల్లో ఒకదానిలో పేలుడు సంభవించింది. అయితే సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారు, కానీ హౌతీ తిరుగుబాటుదారుల సంఘటనా స్థలానికి చేరుకుని షిప్ తో సహా మొత్తం సిబ్బందిని బందీలుగా చేసుకున్నారు.
పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం గతంలో విడుదల చేసిన ప్రకటనలో ఈ దాడిలో ఇజ్రాయెల్ పేరు ప్రస్తావించలేదు. అయితే మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ అగ్నిప్రమాదానికి ఇజ్రాయెల్ డ్రోన్ దాడి కారణమని, షిప్ సిబ్బందిని బందీలుగా చేసుకున్నారని చెప్పారు.
మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి కృషి చేసినందుకు సౌదీ అరేబియా, ఒమన్‌లోని పాకిస్తాన్ అధికారులకు మొహ్సిన్ నఖ్వీ కృతజ్ఞతలు తెలిపారు. ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో వారు మన పౌరులను సురక్షితంగా విడుదల చేసేలా చూశారు అని ఆయన అన్నారు.
ఆయిల్ ట్యాంకర్‌పై దాడి గురించి ఇజ్రాయెల్ స్పందించనప్పటికీ, సౌదీ అరేబియాతో డిఫెన్స్ ఒప్పందం తర్వాత సౌదీ అరేబియా - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నం ఇది కావచ్చునని నమ్ముతున్నారు.