LSG vs DC: ల‌క్నోకు ప్రాణం పోసిన ఆయుష్ బడోని.. ఢిల్లీ ఎదుట సరైన టార్గెట్

LSG vs DC: ల‌క్నోకు ప్రాణం పోసిన ఆయుష్ బడోని.. ఢిల్లీ ఎదుట సరైన టార్గెట్

రాహుల్, డికాక్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్ వంటి హేమాహేమీలు నిరాశపరిచిన చోట.. ఓ కుర్ర బ్యాటర్ జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో పరుగు పరుగు జోడిస్తూ జట్టు పరువు నిలబెట్టడమే కాకుండా.. పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అతనే.. ఆయుష్ బడోని. చూడటానికి పిల్లాడిలా అనిపించినా.. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాడిలా పోరాడాడు. 35 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని పోరాట ఫలితమే 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన లక్నో.. ఢిల్లీ ఎదుట 168 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగలిగింది.   

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోను ఖ‌లీల్ అహ్మ‌ద్ ఆదిలోనే దెబ్బ కొట్టాడు. తన తొలి ఓవ‌ర్ లోనే డేంజరస్ బ్యాటర్ డికాక్(19; 13 బంతుల్లో 4 ఫోర్లు)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 28 ప‌రుగులు వద్ద ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం కొద్దిసేపటికే ప‌డిక్క‌ల్‌(3)ను ఔట్ చేసి రెండో వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అక్కడి నుంచి ఆ బాధ్యతలు కుల్దీప్ తీసుకున్నాడు. 

ప్రాణం పోసిన బడోని

కుల్దీప్ వ‌స్తూ వ‌స్తూనే కేఎల్ రాహుల్(39), మార్కస్ స్టోయినిస్(8), నికోల‌స్ పూర‌న్‌(0)ల‌ను పెవిలియ‌న్ పంపాడు. దాంతో, ల‌క్నో జ‌ట్టు 77 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత భారీ షాట్ కు ప్రయత్నించి దీపక్ హుడా(10) వెనుదిరిగాడు. అక్కడితో 12 ప‌రుగుల వ్యవ‌ధిలో రాహుల్ సేన ఆరో వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో ఆయుష్ బడోని జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో పరుగు పరుగు జోడిస్తూ లక్నో ఇన్నింగ్స్‌కు ప్రాణం పోశాడు. చివరలో అతనికి అర్షద్ ఖాన్(20 నాటౌట్; 16 బంతుల్లో 2 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది.

ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 4, ఖ‌లీల్ అహ్మ‌ద్ 2, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ చెరో వికెట్ తీసుకున్నారు.