లక్నో చేతిలో ఓటమి.. ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ ఔట్

లక్నో చేతిలో ఓటమి.. ఐపీఎల్ నుంచి సన్ రైజర్స్ ఔట్

ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ కథ ముగిసింది. ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పకగెలవాల్సిన మ్యాచులో ఓడిపోయింది. ఉత్కంఠ బరితంగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 183 పరుగుల టార్గెట్ ను లక్నో సూపర్ జెయింట్స్..19.2  ఓవర్లలో కేవలం 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. 

183 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 2 పరుగులే చేసిన కైల్ మేయర్స్ 12 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఈ సమయంలో డికాక్, ప్రెరాక్ మన్కడ్ జట్టును ఆదుకున్నారు. రెండో వికెట్కు 42 పరుగులు జోడించారు. అయితే 19 బంతుల్లో 1 సిక్సు, 3 ఫోర్లతో 29 పరుగులు చేసిన డికాక్..మయాంక్ మార్కండే బౌలింగ్లో ఔటయ్యాడు. 

చెలరేగిన మన్కడ్ 

టార్గెట్ ఛేజింగ్ లో ప్రెరాక్ మన్కడ్ చిచ్చరపిడుగులా చెలరేగాడు. సిక్సులు ఫోర్లతో దుమ్మురేపాడు. స్టోయినీస్ (40)తో కలిసి 3 వికెట్ కు 73 పరుగులు జోడించాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్(44) తో కలిసి  4 వ వికెట్ కు అజేయంగా 58 పరుగులు జతచేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సన్ రైజర్స్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ మార్కండే, అభిషేక్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు. 

అంతకుముందు  టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్  20 ఓవర్లలో 6 వికెట్లకు 182  పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ (7) యుధ్ వీర్ సింగ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి అన్ మోల్ ప్రీత్ సింగ్ తో కలిసి జట్టును ఆదుకున్నాడు. రెండో వికెట్ కు 37 పరుగులు జోడించాడు. అయితే యశ్ ఠాకూర్ బౌలింగ్ లో రాహుల్ త్రిపాఠీ (20) వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మార్కరమ్ (28) పర్వాలేదనిపించాడు. అయితే 82 పరుగల వద్ద అన్ మోల్ ప్రీత్ సింగ్ (36) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ మార్కరమ్ కూడా పెవీలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 115 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

క్లాసెన్ ఖతర్నాక్ ఇన్నింగ్స్

ఈ సమయంలో సన్ రైజర్స్ను హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నాడు. అబ్దుల్ సమద్ తో కలిసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. కేవలం 26 బంతుల్లో 3 సిక్సులు, 3 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. ఇతనికి సమద్ 25 బంతుల్లో 4 సిక్సులు, ఒక ఫోర్ తో 37 పరుగులు చేసి సహకరించాడు. వీరిద్దరు 6 వికెట్ కు 58 పరుగులు జతచేశారు.  లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నాడు.ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, యుధ్ వీర్ సింగ్ ఒక్కో వికెట్ పడటగొట్టారు.