అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి

అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి

లక్నోలోని హజర్ట్‌గంజ్ ప్రాంతంలో లెవనా హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. వారిని  ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం కారణంగా హోటల్‌లో చాలా మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వీరిలో గెస్ట్‌లతో పాటు హోటల్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హోటల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కొందరిని రక్షించారు. ఐరన్‌ రాడ్స్‌ వినియోగించి హోటల్ కిటికీలను బద్దలు కొట్టారు. అందులో నుంచి బాధితులను బయటకు తీసుకొస్తున్నారు.  

సీఎం దిగ్భ్రాంతి..

అగ్నిప్రమాద ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి బాధితులకు సరైన చికిత్స అందించాలని ఉన్నతాధికారులను  ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగం అధికారులకు సూచించారు.  జిల్లా మేజిస్ట్రేట్,సీనియర్ పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని సీఎంవో నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. 

ఉపిరాడక ఇబ్బంది...

లెవనా హోటల్ ఇరుకుగా ఉండటంతో..రెస్క్యూ ఆపరేషన్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. అగ్నిప్రమాదంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో..చాలా మంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. దాదాపు 20 మందికిపైగా లోపల చిక్కుకుపోయారు. మరోవైపు అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.