సుమన్ బాబు లీడ్ రోల్‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో ఎన్. వి.వి. సుబ్బారెడ్డితో కలిసి నిర్మించిన చిత్రం ‘ఎర్రచీర’. రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించింది. కారుణ్య చౌదరి, శ్రీరామ్, కమల్ కామరాజు, అజయ్, అయ్యప్ప పి. శర్మ, సుమన్ శెట్టి, జీవా, సత్యకృష్ణ, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుమన్ బాబు మాట్లాడుతూ ‘యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించాం.
లేడీ ఓరియెంటెడ్ చిత్రం అయినప్పటికీ కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుంది. ఈ కథకు తెలుగు అమ్మాయి అయితేనే సరిగ్గా సరిపోతుందని భావించి కారుణ్య చౌదరిని ఎంపిక చేశా. ఆమె పాత్రలో సస్పెన్స్ ఉంటుంది. ఇది రెగ్యులర్ హారర్ సినిమా కాదు. మదర్ సెంటిమెంట్, యాక్షన్ ఉన్న డిఫరెంట్ కంటెంట్. బి, సి సెంటర్ల థియేటర్లలో ప్రతి షోకి లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం.
ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యదార్థ గాధతో ‘అంబిక (ఎర్రచీర-2)’ సినిమాను ప్లాన్ చేస్తున్నా. అలాగే ‘రాముడా.. కృష్ణుడా’ అనే సినిమా చేస్తున్నా’ అని చెప్పారు.
