ఆసిఫాబాద్ జిల్లాలో లంపి స్కిన్.. 86 పశువులకు వైరస్​, రెండు పశువులు మృతి

ఆసిఫాబాద్ జిల్లాలో లంపి స్కిన్.. 86 పశువులకు వైరస్​, రెండు పశువులు మృతి

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో పశువులపై లంపి స్కిన్ వైరస్ అటాక్ చేస్తోంది. ఇప్పటికే 86 పశువులకు వైరస్​ సోకగా, రెండు పశువులు చనిపోయాయి. రబీ సీజన్  మొదలు కావడం, ఇదే  టైంలో ఈ వైరస్​ సోకుతుండడంతో రైతులు ఆందోళనలో  పడ్డారు.  జిల్లాలోని కౌటాల, దహేగాం, జైనూర్, తిర్యాణి, కెరమెరి, లింగాపూర్ మండలాల్లో  పశువుల్లో వ్యాపిస్తోంది.  గ్రామాల్లో వందల సంఖ్యలో పశువులకు వ్యాధి సోకుతోంది.  

అప్రమత్తమైన అధికార యంత్రాంగం..

జిల్లాలో లంపి స్కిన్  కనిపించడంతో వెటర్నరీ  డిపార్ట్​మెంట్​ అలర్ట్ అయింది. పక్కనే మహారాష్ట్ర ఉండటంతో వాంకిడి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్న  పశువులను   సరిహద్దుల్లోనే   అడ్డుకుని 15 రోజులు క్వారంటైన్ ఉంచేలా చర్యలు చేపట్టారు. దీంతో  వేరే ప్రాంతాలకు పశువులను తరలించడం,  కొత్త వాటిని తీసుకురావడం పై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.   

వ్యాధి లక్షణాలు...

  •     లంపి స్కిన్​  వ్యాధి సోకిన పశువులకు చర్మం పై పెద్ద  కురుపులు, దద్దుర్లు వస్తాయి. 
  •     దోమలు, ఈగలు  వైరస్ ను ఇతర పశువులకు వ్యాపింపజేస్తాయి. 
  •     వ్యాధి సోకిన పశువులకు  జ్వరం , శరీర భాగాలపై గంగడోలు వాపు కనిపిస్తుంది. 
  •     శరీరం పై 2.5 సెంటిమీటర్ల సైజ్​లో   చర్మం  కింద కణతులు ఏర్పడతాయి.
  •     అవి  పగిలి రక్తం కారి మచ్చలుగా మారుతాయి. 
  •     కంటి నుంచి నీళ్లు కారుతాయి.  కాళ్లకు వాపు ఏర్పడి కుంటుతాయి.

ఎద్దు బతుకుతది అనుకోలే.. 

నా ఎద్దుకు లంపి స్కిన్ రోగమచ్చింది.  గంగడోలు వాచింది. మేత తినలే. నీళ్లు తాగలే. అది బతుకుతదో బతుకదో భరోసా లేకుండె. ఎవుసం పనులు ముమ్మిరి మీద ఉన్నప్పుడు ఎద్దుకు ఇట్లా అయితే నాకు చెయ్యిరిగినట్టయింది. బాగా గోస అయింది. మా చుట్టాల దగ్గర ఎద్దును బాడకు తెచ్చి ఎవుసం చేసుడైంది.

 - బుడిపెల్లి లచ్చన్న, రైతు, చిన్న అయినం, దహెగాం

ఎడ్లకు రోగం వచ్చి తిప్పలవుతుంది..

జోడెద్దులకు  రోగం వచ్చి తిప్పలవుతుంది. శనగ, జనము సాగు చేద్దామనుకున్నా. ఈ టైంలో  రోగం పరేషాన్ చేస్తుంది. డాక్టర్లకు చూపించిన. తగ్గుతది అంటున్నారు.   

- హన్మంతరావు రైతు, ఎదల్పాడు, తిర్యాణి.

 నివారణకు చర్యలు

 వ్యాధి సోకితే సాధారణంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న పశువులకు 2 లేదా3 వారాల్లో తగ్గుతుంది.  కొంతకాలం  వరకు పాల ఉత్పత్తి  20 శాతం   తగ్గుతుంది. గవర్నమెంట్  నుంచి 60వేల వాక్సిన్లు వచ్చాయి.   వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు 53 వేల డోసులు వేసినం. పశువుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే రైతులు వెంటనే డాక్టర్లను సంప్రదించాలి.

- డాక్టర్. సురేశ్​ కుమార్, జిల్లా పశువైద్య అధికారి