మల్లన్నసాగర్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

మల్లన్నసాగర్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

మల్లన్న సాగర్ రిజర్వాయర్ భూనిర్వాసితులకు చెల్లించే పరిహారంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ నిర్వాసితుల పునరోపాధి, పునరావాస సాయం పంపిణీ కార్యక్రమం వందకు వంద శాతం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం ఇచ్చే కార్యక్రమం చాలా వరకు పూర్తయిందని, మిగిలిన కొద్దిపాటి ప్రక్రియను కొద్ది రోజుల్లోనే పూర్తి చేసి… ఈ నెల 11 వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సీఎం సూచించారు.

పరిహారం చెల్లింపు విషయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల క్రమంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించినట్టు తెలుస్తుంది. సీనియర్ అధికారులతో మాట్లాడారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అయినా కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియను వెంటనే ముగించే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించాలని… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి సూచించారు సీఎం. పరిహారం పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో నిర్వహించే బాధ్యతలను సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్ కు అప్పగించారు కేసీఆర్.  మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమం చేపట్టేందుకు గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.

ఇంత పెద్ద రిజర్వాయర్ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇండ్లు కోల్పోతున్నారని చెప్పారు సీఎం. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం ఎంతో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరిస్తుందని తెలిపారు. నిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని ఇస్తున్నామని చెప్పారు. 800 కోట్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న…. కేసీఆర్ అది అత్యంత బాధాకరమన్నారు.

మొత్తం ప్రక్రియలో కొద్ది పాటి పరిహారం ఇవ్వడమే మిగిలిందని చెప్పారు. దీనిని అలుసుగా తీసుకుని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి.  పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.