పోటెత్తిన టూరిస్టులు .. సిమ్లాకు మూడు రోజుల్లో 60 వేల వెహికల్స్

పోటెత్తిన టూరిస్టులు ..  సిమ్లాకు మూడు రోజుల్లో 60 వేల వెహికల్స్

సిమ్లా :  వరుస సెలవులతో హిమాచల్ ప్రదేశ్​లోని సిమ్లాకు టూరిస్టులు పోటెత్తారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో హిల్​ స్టేషన్ కు చేరుకున్నారు. దీంతో వేలాది వాహనాలు సిమ్లా దారి పట్టాయి. అటల్​ టన్నెల్ వద్ద రికార్డు సంఖ్యలో వెహికల్స్ రాకపోకలు నమోదయ్యాయి. నేషనల్ హైవేపై వాహనాలు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నిగంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌‌లో చిక్కుకుపోయారు. 

గత 3 రోజుల్లో 55 వేలకు పైగా వాహనాలు సిమ్లాలోకి ప్రవేశించినట్లు అధికారులు అంచనా వేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సిమ్లా నగరంలో దాదాపు 60,000 వాహనాలు రోడ్ల పక్కన నిలిచి ఉన్నాయి. సాధారణ రోజుల్లో సగటున 12,000 వాహనాలు సిమ్లాలోకి ప్రవేశిస్తే, పర్యాటక సీజన్‌‌ వీకెండ్స్​లో ఆ సంఖ్య 26 వేలకు పైగా పెరుగుతుంది. కానీ ఎన్నడూ లేని విధంగా వాహనాలు 55 వేల నుంచి 60 వేల వరకు ఉండటం విశేషం. ఈ ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​ గా మారాయి. 

మరోవైపు, సిమ్లా, మనాలీలోని హోటళ్లు, రిసార్టుల్లో ఆక్యుపెన్సీ 90 శాతం నమోదైందని టూరిజం అధికారులు తెలిపారు. వీకెండ్​లో 90 శాతం నమోదైన ఆక్యుపెన్సీ సోమవారానికి 60 శాతానికి తగ్గిందని వివరించారు. ఆఫీసులు ప్రారంభం కావడంతో టూరిస్టులు తిరిగి వెళ్లిపోతున్నారని, దీంతో హోటళ్లు మళ్లీ ఖాళీ అవుతున్నాయని చెప్పారు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఆక్యుపెన్సీ రేట్​ మళ్లీ పెరుగుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

 కాగా, ‘పదివేల అడుగుల ఎత్తులో ఉన్న అటల్​ టన్నెల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన టన్నెల్.. ఈ టన్నెల్ గుండా డిసెంబర్ 24 న 12 వేల వాహనాల్లో 65 వేల మంది ప్రయాణించారు. ఇటీవలి భూకంపం నుంచి కోలుకున్న హిమాచల్​ ప్రదేశ్ పర్యాటకులకు వెల్కమ్​ చెబుతోంది’ అంటూ హిమాచల్​ప్రదేశ్ సీఎం సుఖ్​విందర్ సింగ్‌‌ ట్వీట్​ చేశారు. ఈ టన్నెల్‌‌ వద్ద మైనస్‌‌12 డిగ్రీల చలిలో రాకపోకలను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని సీఎం సుఖు అభినందించారు.