- మధిర జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి
మధిర, వెలుగు: వైద్యం అత్యంత ఖరీదైన ఈ రోజుల్లో, ఆడబిడ్డ పుడితే ప్రైవేటు ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప విషయమని మధిర జూనియర్ సివిల్ జడ్జి వేముల దీప్తి కొనియాడారు. సోమవారం మధిర పట్టణంలోని వందన ఆస్పత్రిలో ఈ ఉచిత కాన్పు సేవల కార్యక్రమాన్ని ఆమె అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టడం భారమని భావించే వారికి ఇటువంటి పథకాలు చక్కని ప్రోత్సాహమని, ఆడ శిశువుల జనన రేటును పెంపొందించడానికి కృషి చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యాన్ని అభినందించారు. ఆడపిల్లలను తక్కువ చేయకుండా, మగవారితో సమానంగా చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఆమె పిలుపునిచ్చారు.
