
- మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే..
- రాష్ట్ర ప్రజలకు ఫ్రీగా రామ మందిర దర్శనం
- కేంద్ర హోమంత్రి అమిత్ షా హామీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం అయోధ్యలోని రామమందిర దర్శనం ఉచితంగా కల్పిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. సోమవారం విదిశా జిల్లాలోని సిరోంజ్ అసెంబ్లీ స్థానంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో షా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో ఓ బీజేపీ లీడర్ ‘‘ అయోధ్యలో కొత్తగా నిర్మించిన రాముడి ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రార్థనలు చేయడానికి మేము డబ్బు ఖర్చు చేయాలా?’’ అని ప్రశ్నించాడు. దీంతో షా స్పందించి.. “డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.
మధ్యప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే, రాష్ట్ర ప్రజలకు దశల వారీగా అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తాం” అని అమిత్ షా హామీ ఇచ్చారు. ‘‘నేను బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రామమందిర నిర్మాణ తేదీని అడిగేవారు. ఇప్పుడు చెప్తున్నాను.. జనవరి 22, 2024న అయోధ్య (ఉత్తరప్రదేశ్)లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది” అని అమిత్ షా అన్నారు.
అనంతరం ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై మాట్లాడుతూ.. సొంత హామీ లేని వారు హామీ ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం మధ్యప్రదేశ్‌కు పదేండ్లలో రూ.2 లక్షల కోట్లు ఇస్తే.. మోదీ ప్రభుత్వం తొమ్మిదేండ్లలో ఎంపీల ద్వారా రూ.6.35 లక్షల కోట్లు, వివిధ పథకాల కింద రూ.5 లక్షల కోట్లు అదనంగా అందించిందని ఆయన చెప్పారు.