
- సుప్రీంకోర్టుకు వెల్లడించిన మధ్యప్రదేశ్ సర్కారు
- ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ
- 15 వేల పేజీలతో కూడిన అఫిడవిట్
- కోటాను 14 నుంచి 27 శాతానికి పెంచడంపై వివరణ
- ఈ పెంపుతో రిజర్వేషన్ పరిమితి 50 శాతం దాటినా
- దీన్ని ప్రత్యేక పరిస్థితిగా చూడాలని వినతి
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీతో కలిసి
- నిర్వహించిన సర్వే నివేదిక సమర్పణ
భోపాల్: స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీలకు కల్పించిన 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు సవాల్ చేసిన మరుసటిరోజే.. ఇదే అంశంపై మధ్యప్రదేశ్సర్కారు ఆసక్తికర అఫిడవిట్‌ను దాఖలు చేసింది. విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలను సరైన ప్రాతినిథ్యం దక్కాలంటే 50 శాతం పరిమితి దాటినా రిజర్వేషన్ల పెంపును అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
తమ రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన వివక్షకు ఓబీసీ రిజర్వేషన్ల పెంపుతోనే చెక్‌పెట్టొచ్చని సుప్రీంకోర్టుకు మోహన్ యాదవ్ సర్కారు తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ.. ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో 15వేల పేజీలతోఅఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలను పొందుపర్చింది.
ప్రాచీన భారతంలో లేని కుల వివక్ష.. విదేశీ ఆక్రమణల కాలం నుంచే మొదలైందని, అది ఇప్పటికీ సమాజంలో కొనసాగుతున్నదని ఉదాహరణలతో సహా అందులో ప్రస్తావించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీతో కలిసి 2023లో నిర్వహించిన రహస్య సర్వేకు సంబంధించిన నివేదికను సమర్పించింది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఓబీసీలు ఉన్నప్పటికీ.. వారు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో తక్కువ ప్రాతినిథ్యం కలిగి ఉన్నారని పేర్కొన్నది.
అసాధారణ పరిస్థితుల కారణంగానే రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించి 27 శాతానికి పెంచాలని కోరుతున్నట్లు చెప్పింది. దీన్ని ఓ ప్రత్యేక పరిస్థితిగా చూడాలని కోర్టును కోరింది. రాష్ట్రంలో కుల వివక్ష ఎంతలా కొనసాగుతోంది అనే వాస్తవాలను అఫిడవిట్‌లో ఉదాహరణలతో సహా కోర్టు కళ్లకుకట్టింది. ఈ వివక్షను రూపుమాపేందుకు ప్రభుత్వం ఓబీసీలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్.. సంక్షేమ పథకాల్లో ఓబీసీ మహిళలకు 50 శాతం కోటాలాంటి సంస్కరణలను తీసుకురావాల్సి ఉందని ప్రతిపాదించింది.
రాష్ట్రంలో తీవ్ర అస్పృశ్యత
రాష్ట్రంలో అస్పృశ్యత తీవ్రస్థాయిలో ఉన్నదని అఫిడవిట్‌లో మధ్యప్రదేశ్సర్కారు పేర్కొన్నది. ఓ వైపు ప్రాచీన భారతదేశాన్ని కులరహిత, ప్రతిభ ఆధారిత సమాజంగా కీర్తిస్తుంటే.. మరోవైపు మధ్యప్రదేశ్‌లో కులం ఆధారిత వివక్ష లోతుగా పాతుకుపోయిందని తెలిపింది. అగ్రకులస్తులకు చెందినవారికి గౌరవం ఇచ్చేందుకు ఓబీసీల్లోని 56 శాతం మంది మంచాలపై కూర్చోకుండా లేచి నిలబడాల్సి వస్తున్నదని తెలిపింది.
రాష్ట్రంలో అంటరానితనం అధికంగా ఉన్నదని, ఈ కులాలవారిని పూజారులు కూడా గుడుల్లోకి నిరాకరించడం లాంటి అస్పృశ్యతలున్నాయని పేర్కొన్నది. ఇటీవల దామోహ్ లో జరిగిన ఓ ఘటనను ప్రస్తావించింది. ‘‘ఓబీసీ కుష్వాహా వర్గానికి చెందిన ఓ యువకుడు.. ఓ బ్రాహ్మణుడి ఏఐ ఇమేజ్ క్రియేట్ చేశాడని అగ్రవర్ణాలు ఆరోపించాయి.
ఆ బ్రాహ్మణుడి పాదాలు కడిగించి.. బలవంతంగా ఆ నీటిని యువకుడితో తాగించారు. ఈ వీడియో వైరల్ కావడంతో కేసు నమోదైంది” అని కోర్టుకు తెలియజేసింది. అందుకే రిజర్వేషన్లలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరమున్నదని పేర్కొన్నది. ఇందుకోసమే ఓబీసీ రిజర్వేషన్లను 14 శాతం నుంచి 27 శాతానికి పెంచామని అఫిడవిట్‌లో వెల్లడించింది.
వ్యవసాయ కూలీలుగా ఓబీసీ మహిళలు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ వర్సిటీతో కలిసి నిర్వహించిన రహస్య సర్వేలో వివక్ష ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టంగా కనిపించిందని కోర్టుకు మధ్యప్రదేశ్ సర్కారు తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామీణ కుటుంబాలను సర్వే చేశామని, ఇందులో 5,578 కుటుంబాలు అంటే 56 శాతం మంది ఓబీసీలు.. వారి ఇండ్ల వద్దనుంచి అగ్రవర్ణాలు వాళ్లు వెళ్తుంటే మంచంలో నుంచి లేచి నిలబడుతున్నారని పేర్కొన్నది.
3,763 కుటుంబాలతో కలిసి భోజనం చేసేందుకు ఇతర కులాల వాళ్లు అంగీకరించరని వివరించింది. కులాన్ని కారణంగా చూపుతూ 3,238 మంది ఇంటికి పూజలు చేసేందుకు పూజారులు కూడా రాకుండా అస్పృశ్యత పాటిస్తున్నారని వివరించింది. 5,123 కుటుంబాలవారికి మతపరమైన విద్యా సంస్థల్లోకి ప్రవేశం నిరాకరిస్తున్నారని పేర్కొన్నది. ఓబీసీకి చెందిన సగం మంది మహిళలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీ జనాభా ఎక్కువగా ఉన్నా విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి ప్రాతినిథ్యం చాలా తక్కువ అని పేర్కొన్నది.
విచారణ వచ్చే నెల 9కి వాయిదా..
మధ్యప్రదేశ్ సర్కారు సమర్పించిన అఫిడవిట్‌లో టెక్నికల్ అంశాలు ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును సమయం కోరారు. అయితే, దీనిపై ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రోజువారీ విచారణకు అనుకూలమైన కేసు అని, వాయిదాల వల్ల ప్రజలకు న్యాయం ఆలస్యం అవుతుందని మందలించింది. అత్యంత ప్రాధాన్యత గల కేసుగా అభివర్ణిస్తూ.. చివరకు నవంబర్ 9వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.