కొడుకు కోసం పులితో పోరాడిన మహిళ

కొడుకు కోసం పులితో పోరాడిన మహిళ

పులి పేరు వింటనే బాబోయ్ అంటాము. దాన్ని దూరం నుంచి చూడటానికే భయపడిపోతారు.ఒక్కసారి పులి ఎదురైతే ఇంకేమైనా ఉందా? ప్రాణాల మీద ఆశలు వదులుకోవడమే. కానీ ఓ మహిళ మాత్రం తన బిడ్డను కాపాడుకునేందుకు శివంగిలా పోరాడింది. మధ్యప్రదేశ్  ఉమారియా జిల్లా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని రోహనియా గ్రామంలో అర్చన చౌదరి పులితో వీరోచితంగా ఫైట్ చేసింది. పొలానికి తీసుకెళ్లిన 15 నెలల కొడుకు రవిరాజ్ ను పులి తన నోటితో పట్టుకోవడంతో దాన్ని అడ్డగించి ఎదురుదాడికి దిగింది. బిడ్డను కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. పులి గాండ్రింపులు, ఆమె అరుపులతో పక్క పొలాల్లో ఉన్న స్థానికులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసిన పులి రవిరాజ్ ను వదిలేసి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. 

పులి దాడిలో అర్చన చౌదరికి నడుము, చేతికి, వెన్నుకి గాయాలయ్యాయని ఆమె భర్త భోళా ప్రసాద్ తెలిపారు. కొడుకు రవిరాజ్ కు తల, వీపుపై గాయాలయ్యాయి. వెంటనే తల్లీకొడుకులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు తల్లీబిడ్డపై దాడి చేసిన పులిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ కొడుకులను జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ  పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. బిడ్డను కాపాడుకునే క్రమంలో ప్రాణాలను పణంగా పెట్టి పులిలో పోరాడిన మహిళను అందరూ ప్రశంసిస్తున్నారు.