పళని ఎన్నిక చెల్లదు..మద్రాసు హైకోర్టు తీర్పు

పళని ఎన్నిక చెల్లదు..మద్రాసు హైకోర్టు తీర్పు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. అన్నాడీఎంకే పార్టీలో జూన్‌ 23 కంటే ముందున్న  స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. అన్నాడీఎంకేలో  ద్వంద్వ నాయకత్వ విధానం కొనసాగించాలని మద్రాసు కోర్టు తీర్పు చెప్పింది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి ఎన్నిక చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ ఇద్దరి అనుమతి లేకుండా అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించడాన్ని తప్పుపట్టింది. ఏఐఏడీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని తిరిగి నిర్వహించాలని న్యాయమూర్తి జి జయచంద్రన్ పార్టీని ఆదేశించారు. మద్రాసు హైకోర్టు తీర్పుతో పన్నీరు సెల్వంకు ఊరట లభించింది. 

పళనితో కలిసే అంశంపై చర్చిస్తాం..
అన్నాడీఎంకేపై మద్రాసు హైకోర్టు తీర్పు చారిత్రకం అని మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం అన్నారు. ఈ తీర్పు వల్ల తాము విజయం సాధించామని చెప్పారు. పార్టీలో ఎవరైనా తమతో కలిసేందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామని..తీర్పుకు అనుగుణంగా వ్యహరిస్తామని తెలిపారు. ఏఐడీఎంకేలో నియంతృత్వానికి తావులేదని పన్నీరు సెల్వం అన్నారు. అందరూ ఏకం కావాలని కోరారు. పార్టీని వీడిన వారు తిరిగి రావాలన్నారు. అవసరమైతే పళనిస్వామితో కలిసి అంశంపై చర్చిస్తామన్నారు. 

పన్నీరు వర్గీయుల సంబరాలు..
జులై 11న అన్నాడీఎంకే  పార్టీ సర్వసభ్య సమావేశంలో పళని వర్గం నేతలు.. పన్నీర్‌ సెల్వంను పార్టీ పదవుల నుంచి తొలగించి ..తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామిని ఎన్నుకున్నారు. దీనిపై మద్రాస్‌ హైకోర్టులో పన్నీరు సెల్వం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు..పార్టీలో ద్వంద్వ నాయకత్వం కొనసాగించాలని మద్రాసు హైకోర్టు పేర్కొంది. ఈ  ఉత్తర్వులతో పన్నీర్‌ సెల్వం వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. కోర్టు తీర్పు తర్వాత పన్నీరు సెల్వం...ఆయన వర్గీయులు.. చెన్నైలోని జయలలిత స్మారక చిహ్నం వద్ద జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ సీఎం జయలలిత మరణాంతరం పార్టీని నడిపేందుకు ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్‌) కోఆర్డినేటర్‌గా, ఓ పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) జాయింట్ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి అనంతరం ఇరువురు మధ్య విభేదాలు తలెత్తాయి. పార్టీకి వ్యతిరేకంగా, డీఎంకేకు మద్దతుగా ఓపీఎస్‌ వ్యవహరిస్తున్నారని ఈపీఎస్‌ వర్గం ఆరోపించింది. ఈ నేపథ్యంలో జూలై 11న జరిగిన ఏఐఏడీఎంకే సాధారణ కౌన్సిల్ సమావేశంలో పళనిస్వామి, పన్నీరు సెల్వం  పదవులను రద్దు చేశారు. ఈ మీటింగ్ లో పళనిస్వామిను తాత్కాలిక కార్యదర్శిగా నియమించడంతోపాటు పన్నీరుసెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు.