మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం

మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మధ్యప్రదేశ్ సీఎం

మీరు చెడ్డీలు తొడగకముందే సైన్యం ఏర్పాటు

ఖాండ్వా: ‘మోడీజీ, మీరు చెడ్డీలు తొడగడం నేర్చుకోకముందే నెహ్రూ, ఇందిరా గాంధీలు త్రివిధ దళాలను ఏర్పాటు చేశారు’ అంటూ మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ-వాదం, దేశ రక్షణ అంటూ ప్రజల్లో మోడీ భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఐదేళ్ల క్రితం యూపీఏ పాలనలో దేశం సురక్షితంగా ఉండేదని,ఎన్డీఏ పాలనలోనే టెర్రరిస్టు దాడులు ఎక్కువగా జరిగాయని కమల్ నాథ్ ఆరోపించారు. ఈమేరకు మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ కమల్ నాథ్ ను ‘భ్రష్ట్’నాథ్ అంటూ ఎగతాళి చేశారు. దీంతో కమల్ నాథ్ తన విమర్శల పదును పెంచారు. సైనికదాడులను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలనలోనే పార్లమెంట్ దాడి జరిగిందని గుర్తు చేశారు. దాడులకు సంబంధించిన లెక్కలు పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుందని కమల్ నాథ్ చెప్పారు. గత లోక్ సభ ఎన్నికలముందు మోడీ ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీశారు. యువతకు ఉద్యోగాలేవి? విదేశాల నుంచి నల్లధనం ఎంత వెనక్కి తీసుకొచ్చారు? అంటూ ప్రశ్నలు గుప్పించారు.