సికింద్రాబాద్​ ఎంపీ సీటు బీఆర్​ఎస్​దే : మాగంటి గోపీనాథ్

సికింద్రాబాద్​ ఎంపీ సీటు బీఆర్​ఎస్​దే :  మాగంటి గోపీనాథ్

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్​లోక్​సభ పరిధిలో ప్రజలు బీఆర్ఎస్​కే పట్టం కట్టారని, ఎంపీ ఎన్నికల్లోనూ ఈ సీటును తామే గెలుచుకుంటామని జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ అన్నారు. శనివారం తెలంగాణ భవన్​లో సికింద్రాబాద్, హైదరాబాద్​ లోక్​సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

సమావేశంలో కార్యకర్తలు మంచిచెడులపై మాట్లాడారని, మంచి సూచనలు చేశారని తెలిపారు. కార్యకర్తలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కేటీఆర్​ ఓపికతో విన్నారని, వారందరినీ కాపాడుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్​పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇప్పటికే ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతోందన్నారు. బీఆర్ఎస్ ​ప్రభుత్వం ఏ పథకం అమలు చేసేందుకు కూడా ప్రజలను లైన్లలో నిల్చోబెట్టలేదన్నారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం గ్యారంటీల అమలు కోసం ప్రజలందరినీ రోడ్లపైకి తెచ్చిందని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో మాత్రం చెప్పడం లేదన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంచుతుంటే తులం బంగారం ఏదని లబ్ధిదారులే అడుగుతున్నారని, రానున్న రోజుల్లో ప్రజల నుంచి ప్రభుత్వం నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక పార్టీని బొంద పెట్టడం ఎవరితరం కాదని, సీఎం హోదాలో ఉన్న రేవంత్​రెడ్డి అహంకారంతో ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈసారి సికింద్రాబాద్​ఎంపీ సీటును కచ్చితంగా గెలుస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అన్నారు.

ఎవరెన్ని సీట్లు గెలుస్తరో చూద్దాం: ఎమ్మెల్యే దానం

పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్ఎస్​ను వంద మీటర్ల లోతులో తొక్కి పెడుతామని సీఎం రేవంత్​రెడ్డి అంటున్నారని, లోక్​సభ ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారో చూద్దామని ఖైరతాబాద్​ఎమ్మెల్యే దానం నాగేందర్​అన్నారు. అధికారిక పర్యటనలో ఉన్న సీఎం.. లండన్​లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారని మండిపడ్డారు. 

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి కృషి చెయ్యాలే తప్ప.. ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అధికారం ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని, తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా ఉన్నామని దానం అన్నారు. కేంద్రంతో సఖ్యత గురించి గొప్పగా చెప్పుకుంటున్న రేవంత్.. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించబోమని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు.