అక్కడ గెలిచినోల్లే జడ్పీ చైర్మన్!.. గంగారం జడ్పీటీసీ సీటుకు మస్తు డిమాండ్

అక్కడ గెలిచినోల్లే జడ్పీ చైర్మన్!.. గంగారం జడ్పీటీసీ సీటుకు మస్తు డిమాండ్
  • మహబూబాబాద్​జిల్లా జడ్పీ చైర్మన్ జనరల్ కు రిజర్వ్.. 
  • జిల్లాలో ఆ ఒక్క మండలమే జనరల్​ కావడంతో అందరి చూపు అటు వైపే..
  • మంత్రి ఆశీస్సులు ఉంటేనే జడ్పీపీఠం దక్కేది!

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ మహిళకు కేటాయించారు. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ పదవి జనరల్ కు రిజర్వ్ కావడం, జిల్లాలో కేవలం గంగారం జడ్పీటీసీ స్థానం మాత్రమే జనరల్ కు కేటాయించడంతో అన్ని పార్టీల నేతల చూపు ఇప్పడు ఆ మండలంపై పడింది. నేతలంతా ఎన్నికల్లో పోటీ చేయడానికి గంగారం బాట పడుతున్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్​ కేటాయింపులకు అనుకూలంగా 8న కోర్టు తీర్పు వస్తే, మంత్రి సీతక్క ఆశీస్సులు ఉన్న వాళ్లే జడ్పీ చైర్మన్​ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపు...

జిల్లాలో మొత్తం 18 మండలాల్లో ఏడు మండలాల జడ్పీటీసీలు బీసీ రిజర్వేషన్ కాగా, ఏడు ఎస్టీ, రెండు ఎస్సీ రిజర్వు కాగా, గంగారం మండలం జడ్పీటీసీ జనరల్, గార్ల జడ్పీటీసీ జనరల్ మహిళలకు కేటాయించారు. జడ్పీ చైర్మన్​గా పురుషులే ఎక్కువగా పోటీ పడుతున్నందున ఆశావహులంతా గంగారం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మొదలైన లోకల్​వార్..

గిరిజనేతరులు గంగారం మండలం నుంచి పోటీకి సిద్ధమవుతుండగా, తమ మండలానికి స్థానికేతరులు రావొద్దని వివిధ పార్టీలకు చెందిన స్థానిక నేతలు సోషల్​ మీడియా వేదికగా వార్​ మొదలుపెట్టారు. గిరిజనులు, ఆదివాసులు మేల్కొనాలని, డబ్బు సంచులతో వచ్చే ఇతర ప్రాంత నేతలను తరమి కొట్టాలంటూ ప్రచారం ప్రారంభించారు. గంగారం మండలంలో 12 జీపీలు ఉండగా, 4,543 మంది పురుషులు, 4,631 మహిళలు, మొత్తం 9,174 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా ఓటర్లు గిరిజనులే ఉన్నారు.

కార్యకర్తలు అధైర్యపడొద్దు..

మహబూబాబాద్​ జిల్లా పరిషత్​ చైర్మన్​పదవి జనరల్​కు రిజర్వ్​ కావడం, ములుగు అసెంబ్లీ పరిధిలోని గంగారం మండలం మాత్రమే జనరల్​కు రిజర్వ్​కావడంతో పోటీ చేసే అశావహుల సంఖ్య అధికంగా ఉండనుందని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం గంగారం మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో మాట్లాడుతూ కాంగ్రెస్​ అధిష్టానం ప్రతీ మండలం నుంచి 3 పేర్లు పీసీసీ కమిటీకి పంపించనున్నట్లు చెప్పారు. 

జిల్లాలో పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, కాంగ్రెస్​అధిష్టానం నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని కోరారు. టిక్కెట్ల కేటాయింపు సమయంలో కార్యకర్తల మనోభావాలను గుర్తించి, మెజార్టీ అభిప్రాయాలను తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. సోషల్​ మీడియా వేదిక అనవసరపు ప్రచారాలను మానుకోవాలని కోరారు.