వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలి : కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని కలెక్టర్ విజయేందిర బోయి చెప్పారు. కాలానుగుణంగా కార్మికులు తమ  ఉత్పత్తులు, డిజైన్లను అప్ డేట్ చేసుకోవాలని సూచించారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని  గద్వాల, నారాయణపేట, అమరచింత, కొత్తకోట చేనేత వస్త్రాలకు దేశంతోపాటు విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. 

కొత్త డిజైన్లతో చేనేత వస్త్రాలు తయారు చేయాలని చెప్పారు. అనంతరం నేతన్న పొదుపు, భద్రత కింద రూ.11.48 లక్షల విలువైన చెక్కును చేనేత సంఘాలకు అందజేశారు. అడిషనల్  కలెక్టర్(రెవెన్యూ) ఏనుగు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ బెక్కరి అనితా రెడ్డి,  జడ్పీ సీఈవో వెంకట రెడ్డి, డీఈవో ప్రవీణ్ కుమార్, డీపీఆర్వో శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ డీవో రాజేశ్​బాబు, ఏడీవో లావణ్య తదితరులున్నారు. 

చేనేత ఉత్పత్తులను ఆదరించాలి 

మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: చేనేత ఉత్పత్తులను ఆదరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో చేనేత, జాళి శాఖ ఆధ్వర్యంలో చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, కార్మికులతో సమావేశమయ్యారు. నారాయణపేట జిల్లాలో ప్రతీ మగ్గాన్ని జియో ట్యాగ్ చేయించాలని చెప్పారు.

 జిల్లాలో చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేక అధికారిని నియమించి, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆర్డీవో రామచందర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలన్నారు. అనంతరం చేనేత పొదుపు, భరోసా కింద రూ.25. 03 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. చేనేత సొసైటీ కోటకొండ అధ్యక్షుడు పగుడాకుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గడప జ్ఞానదేవ్, సిల్క్ సంఘం అధ్యక్షుడు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.  

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

నారాయణపేట మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వంట గది, సరుకులను పరిశీలించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పారు. మైనారిటీ అధికారి రషీద్, ప్రిన్సిపాల్ ఖాజా మెహబూబ్ పాల్గొన్నారు. 

రైతులకు పరిహారం చెక్కులు పంపిణీ

నారాయణపేట– కొడంగల్ ఎత్తిపోతల పథకంలో బాగంగా భూములు కోల్పోయిన రైతులకు ఆర్డీవో కార్యాలయంలో గురువారం చెక్కులు పంపిణీ చేశారు. సింగారం, పెరపల్లి గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి, తమ  భూములు ఇచ్చారని ఆర్డీవో రామచంద్రనాయక్ తెలిపారు. సింగారంలో 11 మంది రైతులకు రూ.19,73,600, పెరపల్లిలోని18 మంది  రైతులకు రూ.63,63,610 లక్షల విలువైన చెక్కులు ఇచ్చామని పేర్కొన్నారు.  

చేనేత కార్మికులకు సహకారం అందిస్తాం

వనపర్తి, వెలుగు: చేనేత కార్మికుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. నైపుణ్యాన్ని మెరుగు పరుచుకునేందుందుకు శిక్షణ ఇప్పిస్తామని పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు ప్రతీ సోమవారం చేనేత దుస్తుల్లో విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేశామన్నారు. ప్రభుత్వం రూ.లక్ష  వరకు ఉన్న చేనేత రుణాలను మాఫీ చేసిందని చెప్పారు.

 చేనేత వస్త్రాలను ప్రచారం నిమిత్తం కలెక్టరేట్ లో పెడతామని చెప్పారు. వ్యాస రచన, ఉపన్యాస పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులు  మాధవి, హితస్విని, ఫజియా సుల్తానా, ఎస్.నవ్య, సౌమ్య, గౌతమికి ప్రశంసాపత్రాలు అందించారు. ఏడీసీ యాదయ్య, చేనేత, జౌళిశాఖ ఏడీవో  ప్రియాంక, వెల్టూరు చేనేత సొసైటీ అధ్యక్షుడు వెంకటయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తదితరులున్నారు.