మహబూబ్‌నగర్ కలెక్టరేట్, వెలుగు: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించకుంటే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. శుక్రవారం ఏనుగొండ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పప్పులో ఆకుకూరలు ఎందుకు వేయలేదని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం సంక్రాంతి సెలవుల నేపథ్యంలో విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడారు. సెలవుల్లో పిల్లలతో సమయం గడపాలని, వారి అలవాట్లను గమనిస్తూ ఉండాలని సూచించారు. కేజీబీవీలో విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్సీ తనిఖీ : పట్టణంలోని ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగాన్ని పరిశీలించి, ఔట్‌పేషెంట్ల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల గర్భిణీల జాబితా ప్రకారం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించాలని ఆదేశించారు. తనిఖీ సమయంలో మెడికల్ ఆఫీసర్ డా.నరేశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
