కాళేశ్వరం బోగస్ ​అని దేవుడే నిరూపించిండు

కాళేశ్వరం బోగస్ ​అని దేవుడే నిరూపించిండు
  • ఎల్లంపల్లి నుంచే 
  • మల్లన్నసాగర్​కు నీరు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ పెద్ద బోగస్​ అని వరుణ దేవుడు నిరూపించాడని మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోయకున్నా.. ఎల్లంపల్లి ప్రాజెక్టు, మిడ్​మానేరు నుంచే మల్లన్నసాగర్​కు నీళ్లు చేరాయని తెలిపారు.

కేసీఆర్, హరీశ్​రావు, ఇతర  బీఆర్ఎస్  నేతలు చెప్పే మాటలన్నీ అబద్ధాల పుట్టేనని విమర్శించారు. శనివారం ఆయన సెక్రటేరియెట్​లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఒక్క టీఎంసీ నీటిని లిఫ్ట్​ చేయకుండానే లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నామన్నారు.

నాడు ప్రాణహిత ప్రాజెక్టుకు కాంగ్రెస్​ ప్రభుత్వం డిజైన్​ చేసింది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వాలనుకున్నది. అలాంటి ప్రాజెక్టును పక్కకు పెట్టి లక్షల కోట్లు గోదావరి పాల్జేశారు.

కాళేశ్వరం గుండె కాయ మేడిగడ్డ అని కేసీఆర్​అన్నారు. కానీ, ఇప్పుడు మేడిగడ్డ నుంచి నీళ్లు రాకున్నా మిడ్​ మానేరు కింద ఉన్న రిజర్వాయర్లు ఎలా నిండాయి?’’ అని ఫైర్​అయ్యారు. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.  ఆ బండారం బయటపడుతుందనే పీఏసీలో నానా హంగామా చేసి బాయ్​కాట్​ చేశారని శ్రీనివాస్​ రెడ్డి విమర్శించారు.

కుంభకోణం చేసిన మంత్రులు పీఏసీ చైర్మన్​ అయ్యి ఆ కుంభకోణాన్ని కప్పేయాలనుకున్నారని తెలిపారు. కానీ, అదృష్టవశాత్తు ఆ కుటుంబం చేతిలో పీఏసీ చైర్మన్​ పదవి లేదన్నారు. ఎస్ఎల్బీసీని కేసీఆర్​ఎప్పుడూ ప్రస్తావించలేదని, ఇప్పుడు తమ సర్కార్​ పునర్నిర్మిస్తున్నదని వెల్లడించారు. కేసీఆర్​ డిజైన్​ చేసిన ప్రతి ప్రాజెక్టులోనూ నిర్మాణ లోపం ఉందని శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు.