మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్

 మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఓ వైపు రాజకీయ నాయకుల్ని, మరో వైపు సినీ ప్రముఖుల్ని టెన్షన్ పెట్టింది. తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న దీపక్ నేపాలీని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ క్రైమ్ బ్రాంచ్, వైశాలి నగర్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరిగా నేపాలీ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అతను ఛత్తీస్‌గఢ్‌లోని వైశాలి నగర్‌కు చెందినవాడిగా గుర్తించిన పోలీసులు.. మరో సూత్రధారి సౌరభ్ చంద్రకర్‌కు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు కనుగొన్నారు.

మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ముంబై పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో డాబర్ గ్రూప్ చైర్మన్ మోహిత్ బర్మన్, డైరెక్టర్ గౌరవ్ బర్మన్ సహా 31 మంది నిందితులు ఉన్నారు. సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్, వివిధ అసోసియేట్‌లు, ఇతర భాగస్వాములతో పాటు యాప్‌ను అమలు చేయడం, ప్రచారం చేయడానికి బాధ్యత వహించారు. ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది.

అక్టోబర్‌లో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఎ) కోర్టులో ఉప్పల్, చంద్రకర్‌లపై ఈడీ మనీలాండరింగ్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. భారత పౌరసత్వాన్ని వదులుకోనప్పటికీ, పసిఫిక్ మహాసముద్రంలోని వనాటు అనే ద్వీప దేశమైన ఉప్పల్ పాస్‌పోర్ట్ తీసుకున్నట్లు చార్జ్ షీట్‌లో ఏజెన్సీ కోర్టుకు తెలియజేసింది.