ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. మిత్ర పక్షాలతో కలిసి మరాఠిలో మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 99 మంది అభ్యర్థుల పేర్లతో 2024, అక్టోబర్ 20న ఫస్ట్ లిస్ట్‌ను కాషాయ పార్టీ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్‌లో పలువురు కీలక నేతలకు టికెట్లు కన్ఫామ్ చేసింది బీజేపీ హైకమాండ్. మహారాష్ట ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నారు.
మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులేకు కమ్తీ అసెంబ్లీ టికెట్ కేటాయించగా.. రాజ్యసభ ఎంపీ అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ అశోక్ చవాన్ భోకర్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు. మంత్రి సుధీర్ ముంగంటివార్ బల్లార్‌పూర్ స్థానం నుంచి, కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే కుమారుడు సంతోష్ భోకర్దాన్ నుండి బరిలోకి దిగారు. కాగా, 2024, అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే.
ALSO READ | జార్ఖండ్లో 70 సీట్లలో జేఎంఎం, కాంగ్రెస్ పోటీ
మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2024, నవంబర్ 20వ తేదీన సింగల్ ఫేజ్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల కానున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉండగా అందులో బీజేపీ 151 స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ మిత్రపక్షాలు శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి దక్కిన 151 స్థానాలకు గానూ తొలి విడతలో 99 మంది పేర్లను అనౌన్స్ చేసింది. మిగిలిన 52 సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్:
- నోటిఫికేషన్ వెలువడు తేదీ: 22/10/ 2024
- నామినేషన్ల దాఖలకు చివరి తేదీ: 29/10/ 2024
- నామినేషన్ల పరిశీలన: 30/10/ 2024
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 04/11/ 2024
- పోలింగ్ జరుగు తేదీ: 20/11/ 2024
- కౌంటింగ్ తేదీ: 23/11/ 2024
- మహారాష్ట్ర: 288 అసెంబ్లీ సీట్లు(జనరల్-234, ఎస్సీ-29, ఎస్టీ- 25)
మొత్తం ఓటర్ల సంఖ్య: 9 కోట్ల 63 లక్షలు
- పురుష ఓటర్లు: 4 కోట్ల 97 లక్షలు
- మహిళా ఓటర్లు: 4 కోట్ల 66 లక్షలు
- యువత: 1.86 కోట్లు
- తొలిసారి ఓటు హక్కు: 20.93లక్షలు
- మొత్తం పోలింగ్ స్టేషన్లు: లక్షా 186
- ఒక్కో పోలింగ్ బూతుకు 960 మంది ఓటర్లు
- మోడల్ పోలింగ్ స్టేషన్ 530