
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు చెప్పింది. బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా అసెంబ్లీలో ఫ్లోర్టెస్టు నిర్వహించాలని ఆదేశించింది. బలపరీక్షే ఏకైక అజెండాగా అసెంబ్లీని సమావేశపర్చాలని, ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్న తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణాలు చేయాలని సూచించింది. ప్రమాణాలు పూర్తయిన వెంటనే ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఫ్లోర్ టెస్టు చేపట్టాలని, ఈ ప్రక్రియనంతా టీవీల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేయాలని, ఇదంతా సాయంత్రం ఐదు గంటల్లోపే జరిగిపోవాలని కోర్టు నిర్దేశించింది. మెజార్టీ లేకుండానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా బెంచ్ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. కాగా, కోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే సీఎం పోస్టుకు ఫడ్నవిస్ రాజీనామా చేయడంతో బుధవారంనాటి అసెంబ్లీ సమావేశం ఎమ్మెల్యేల ప్రమాణాలతో ముగియనుంది. తీర్పు సందర్భంగా.. పొలిటికల్ క్రైసిస్ ఏర్పడిన సందర్భాల్లో వివాదాలకు తప్పనిసరిగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత కోర్టుకు ఉందని, అన్ని పక్షాలూ రాజ్యాంగ నైతికతను కాపాడాల్సిన అవసరం ఉందని బెంచ్ వ్యాఖ్యానించింది. రాజ్యాంగ దినోత్సవం నాడు ఇచ్చిన ఈ తీర్పు.. ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టుకోవడంతోపాటు సుపరిపాలనపై పౌరులకుండే హక్కును కాపాడుకునేందుకూ దోహదపడుతుందని జడ్జిలు అభిప్రాయపడ్డారు.
జడ్జిమెంట్ హైలైట్స్
- బుధవారం సాయంత్రం 5 గంటలలోగా బలపరీక్ష పూర్తి కావాలి.
- బలనిరూపణకు వీలుగా ప్రోటెం స్పీకర్‌ను ఎన్నుకోవాలి.
- ఫ్లోర్ టెస్ట్‌కు ముందే ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించాలి.
- ఫ్లోర్ టెస్ట్‌ను టీవీలో లైవ్‌గా చూపించాలి.
- బలపరీక్షకు సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ఉపయోగించ కూడదు.
19 పేజీల తీర్పు
మహారాష్ట్ర ఇష్యూపై ఏకగ్రీవంగా రాసిన 19 పేజీల తీర్పులో ముగ్గురు జడ్జిలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాల ఏర్పాటులో కోర్టుల జోక్యం, వాటికుండే పరిధులపైనా కామెంట్లు చేశారు. తీర్పు కాపీలో ఏముందంటే.. ‘‘పార్లమెంటరీ స్వేచ్ఛపై కోర్టులు జోక్యం చేసుకోరాదనే వైరుధ్యం ఒకవైపు, ప్రజాస్వామ్య ప్రక్రియలో న్యాయపరమైన జోక్యమే చిట్టచివరి పరిష్కారమనే భావన మరోవైపు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో.. శాసన, న్యాయవ్యవస్థలలకు సంస్థాగతంగా ఉండే సౌలభ్యాలు, స్పష్టమైన అధికారాల విభజనను మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర కేసు కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, పౌరులకుండే సుపరిపాలన హక్కుతో ముడిపడిఉంది. రెండు పక్షాలు బలపరీక్షకు రెడీగా ఉన్న సందర్భంలో ఆ మేరకు ఆదేశాలివ్వడమే అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పు అవుతుందని మేం భావించాం. ఈ తీర్పుపై ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన అవసరంలేదు. గతంలో కర్నాటక, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీల్లో క్రైసిస్ తలెత్తినప్పుడు కూడా కోర్టులు ఈరకమైన తీర్పులనే ఇచ్చాయి. సంక్షోభ సమయంలో బలపరీక్ష ఆలస్యమయ్యే కొద్దీ ఎమ్మెల్యేల కొనుగోళ్లు, బేరసారాలకు ఎక్కువ అవకాశం ఇచ్చినట్లవుతుంది.
కోర్టులు వెంటనే ఆదేశాలివ్వడం ద్వారా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడినట్లవుతుంది. బలపరీక్ష విషయంలో కోర్టులు జోక్యం చేసుకోరాదన్న వాదనకు అసలు అర్థమేలేదు. దీనికి సంబంధించి1994నాటి ‘‘ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా”కేసులో స్పష్టమైన తీర్పులున్నాయి. ఇటీవల కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పు కూడా అదే కోవలోకి వస్తుంది. రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉన్న ప్రజాస్వామిక సూత్రాలతోపాటు ఓటర్ల తీర్పు ప్రతిబించేలా ప్రభుత్వాలు ఏర్పాటుకావాలేతప్ప, గవర్నర్‌కు నచ్చినట్లు కానేకాదు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేదు. గవర్నర్ తన సొంత అంచనాలతో నిర్ణయాలు తీసుకోవడమనే ప్రశ్నకు అవకాశమేలేదు. మా ఉద్దేశం ప్రకారం.. సీఎం లేదా కేబినెట్ సభ విశ్వాసాన్ని కోల్పోయిందనే సందేహం ఎప్పుడు వచ్చినా, దానికి అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహణే సరైన పరిష్కారమవుతుంది. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే గవర్నర్ విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా దానికి సంబంధించిన రికార్డుల్ని గవర్నర్ తన రిపోర్టులో పొందుపర్చాల్సి ఉంటుంది. సభలో ఫ్రీ ఓటింగ్ సాధ్యం కాదనడానికి గవర్నర్ చెప్పే కారణాలు కూడా అంతే సహేతుకంగా ఉండాలి”అని జస్టిస్ ఎన్వీ రమణ బెంచ్ తెలిపింది.