పంట నష్టానికి రూ.53 చెల్లింపు.. పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ రైతు లేఖ

పంట నష్టానికి రూ.53 చెల్లింపు..  పోలీస్ ప్రొటెక్షన్ కావాలంటూ రైతు లేఖ

ఖరీదైన మంచి నీళ్ల బాటిల్ కూడా వెయ్యి రూపాయలు ఉంటుంది.. ఖరీదైన కాఫీ, టీ కూడా వందల్లో ఉంటుంది.. టిఫిన్ చేయాలన్నా కనీసంలో కనీసం వంద రూపాయలు అవుతుంది.. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి రావాలన్నా వంద రూపాయలు ఖర్చు చేయాల్సిందే.. ధరలు ఇలా ఉన్న రోజుల్లో.. ఈ కాలంలో.. ఓ రైతు తన పంట నష్టానికి బీమా పరిహారంగా.. అక్షరాల 53 రూపాయలు అందుకున్నాడు.. మీరు చదువుతున్నది నిజమే.. అక్షరాల 53 రూపాయలు.. ఇటీవల పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడి పత్తి పంట మొత్తం నాశనం అయ్యింది.. ఇందు కోసం పంట బీమా కింద, రాష్ట్ర ప్రభుత్వాలు.. చాలా కాలం.. సుదీర్ఘంగా లెక్కలు కట్టి.. నిజ నిర్థారణ చేసుకుని.. ఆ రైతుకు 53 రూపాయలు పంట నష్ట పరిహారాన్ని.. చెక్కు రూపంలో అందించారు.

అంత డబ్బుతో ఏం చేయాలో అర్థం కాని ఆ రైతు.. పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలని కలెక్టర్ కు లేఖ రాశారు.. పంట నష్ట పరిహారం కింద వచ్చిన 53 రూపాయలను చూసి.. మా బంధువులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు.. ఆ డబ్బుపై కన్నేశారని.. ఎక్కడ దోపిడీ చేస్తారో అని.. ప్రత్యేక భద్రత కోరుకుంటున్నట్లు కూడా లేఖ ద్వారా వివరించాడు ఆ రైతు.. ఇంతకీ ఇంత అద్భుతం జరిగింది ఎక్కడా అంటారా.. మన దేశంలోనే.. మన మహారాష్ట్రలోనే.. పూర్తిగా వివరాలు తెలుసుకుందామా...

మహారాష్ట్ర యావత్మాల్‌ ఘతంజీ తహసీల్‌లోని శివాని గ్రామానికి చెందిన దిలీప్ రాథోడ్ అనే రైతు తన పత్తి, సోయాబీన్ పంటలకు అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టానికి సంబంధించి బీమా చెల్లింపుగా రూ.52.99 అందుకున్నాడు. ఈ సందర్భంగా తన ఆందోళనను బయటపెట్టడానికి వ్యంగ్యంతో కూడిన ఓ లేఖ రాశాడు. అతను ఆ మొత్తాన్ని ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లడానికి కనీసం ఆరుగురు సిబ్బందితో పోలీసు రక్షణను కోరుతూ యవత్మాల్ పోలీసు సూపరింటెండెంట్‌కు లేఖ రాశాడు.

డిసెంబర్ 7, 2023 నాటి తన లేఖను డిసెంబర్ 11న కటోల్ ఎన్‌సీపీ ఎమ్మెల్యే అనిల్ దేశ్‌ముఖ్ మీడియాతో పంచుకున్నారు. రైతు వేలల్లో నష్టపోయాడన్న ఆయన.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేయడానికి మాటలు లేవని రాథోడ్ పేర్కొన్నాడన్నారు. పంట నష్టానికి చెల్లించిన మొత్తంతో, అతను వ్యవసాయ రుణాన్ని తిరిగి చెల్లించగలడని, అనారోగ్యంతో ఉన్న తన భార్య చికిత్స కోసం కొంత డబ్బు ఖర్చు చేయగలడని చెప్పినట్టు అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.

రైతు తనకు బీమా చెల్లింపుగా వచ్చిన మొత్తంపై స్పందిస్తూ.. మిగిలిన చెల్లింపుతో తాను గౌహతి పర్యటనకు వెళ్లాలనుకుంటున్నానని చెప్పాడు. తాను భారీ మొత్తాన్ని అందుకున్నందుకు చాలా సంతోషిస్తున్నానని, తనకు పోలీసు రక్షణ అవసరమని రాథోడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆశీర్వాదంతో బీమా కంపెనీ పత్తి, సోయాబీన్‌లకు రూ.52.99 'కానుక'గా ఇచ్చిందని రాథోడ్ రాశాడు. రూ.52.99 అనే పేమెంట్ అనేది తన లాంటి పేద రైతుకు చాలా పెద్ద మొత్తమని.. ఇప్పుడు దాన్ని ఇంటికెలా తీసుకెళ్లాలని ఆందోళన చెందుతున్నానన్నాడు. ఈ డబ్బును ఇంటికి తీసుకెళ్లడానికి ఎద్దుల బండిపై కలెక్టర్ కార్యాలయానికి తీసుకు రావాలనుకున్నానని, చాలా మంది ప్రజలు ఈ మొత్తాన్ని చూస్తారేమోని భయపడుతున్నానని వ్యంగ్యంగా చెప్పాడు. ముఖ్యంగా యవత్మాల్‌లో ఇంత తక్కువ మొత్తాలను పొందిన రైతులు మరికొందరు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.