జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు మహా సర్కార్ ప్రచారం

జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు మహా సర్కార్ ప్రచారం

గాంధీ జయంతి సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఫోన్‌లో హలో బదులుగా వందేమాతరం అందాం అంటూ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ప్రజల్లో జాతీయతా భావాన్ని పెంపొందించేందుకు ఈ ప్రచారాన్ని స్టార్ట్ చేసినట్టు స్పష్టం చేసింది. ఫోన్‌కాల్స్‌ వచ్చినప్పుడు అవతలి వ్యక్తిని పలకరించడానికి ప్రతిఒక్కరూ వాడే ‘హలో’కు బదులుగా ఇకపై ‘వందేమాతరం’ అనాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీనికి సంబంధించిన ఓ తీర్మానాన్ని శిండే సర్కార్ జారీ చేసింది. అయితే ఇది తప్పనిసరేం కాదని, వివిధ ప్రభుత్వ శాఖల్లోని అధిపతులు తమ సిబ్బందిని ‘వందేమాతరం’ అనేలా ప్రోత్సహించాలని కోరింది. దీనిపై ప్రజల్లోనూ అవగాహన కల్పించేందుకు ప్రచారం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా వార్ధాలో మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాలశాఖ మంత్రి సుధీర్‌ ముంగంటివార్‌ ప్రారంభించారు. మహారాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన 850 మంది ముఖ్య వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఆడియో బుక్‌ రూపొందించనుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.