ఊరంతా కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు

ఊరంతా కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ వృద్ధాశ్రమంలో 67 మందికి కరోనా సోకింది. ఇందులో 62 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ కూడా పూర్తయింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించినట్లు థానే జిల్లా అధికారులు తెలిపారు. థానే జిల్లా సోర్గావ్ గ్రామంలో మాతోశ్రీ వృద్ధాశ్రమంలో 109 మంది వృద్ధులు ఉంటున్నారని జిల్లా హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ రెంగె చెప్పారు. ఓల్డేజ్‌ హోమ్‌లో ఉన్న ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో డాక్టర్ బృందాన్ని పంపి అందరికీ టెస్టులు చేశామన్నారు. అందులో 67 మందికి పాజిటివ్ వచ్చిందని, వారందరినీ థానే జిల్లా ప్రభుత్వం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాశ్రమంతో పాటు సోర్గావ్ గ్రామం మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించామని, ఊరిలో ఉన్న మొత్తం 1,130 మందిపై సర్వైలెన్స్ ఉంచామని అన్నారు.

ఒమిక్రాన్ భయం.. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనలు నెలకొని ఉండడంతో కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్‌కు లోబడి 15 మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపామని థానే జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ కైలాష్ పవార్ చెప్పారు. మొత్తం 67 మంది పేషెంట్లలో ఐదుగురు వృద్ధాశ్రమం సిబ్బంది ఉన్నారని, వాళ్లు కూడా వృద్ధులేనని తెలిపారు. 30 మందికి ఎటువంటి లక్షణాలు లేవన్నారు. 41 మందికి కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని పవార్ తెలిపారు.