
పోలీసుల దాడుల్లో డ్రగ్స్ పట్టుబడటం గురించి వార్తలు తరచూ వింటూనే ఉంటాం.. ఎప్పటికప్పుడు పోలీసులు నిర్వహించే దాడుల్లో అంతర్రాష్ట్ర ముఠాలు, ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్లు పట్టుబడటం కూడా చూశాం. కానీ.. డ్రగ్స్ తయారీ కోసం ఏకంగా ఫ్యాక్టరీని పెట్టారంటే నమ్ముతారా.. ? అవును నిజం.. మన హైదరాబాద్ లోనే బయటపడింది ఈ అతిపెద్ద డ్రగ్స్ దందా. హైదరాబాద్ లో అతిపెద్ద డ్రగ్స్ నెట్వర్క్ గుట్టు రట్టయ్యింది. శనివారం ( సెప్టెంబర్ 6 ) మహారాష్ట్ర పోలీసులు జరిపిన ఆకస్మిక దాడులతో అతిపెద్ద డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మేడ్చల్ జిల్లాలో మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో మహా డ్రగ్స్ దందా బయటపడింది. MD డ్రగ్స్ తయారీ కోసం ఏకంగా ఫ్యాక్టరీని పెట్టారు దుండగులు. డ్రగ్స్ తయారీ యూనిట్ పై దాడులు నిర్వహించిన పోలీసులు 32 వేల లీటర్ల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు MD డ్రగ్స్, సరఫరా అవుతున్నట్లు గుర్తించారు పోలీసులు.
►ALSO READ | వైభవంగా సాగుతున్న బాలాపూర్ గణేష్ శోభాయాత్ర..
ఈ దాడుల్లో భారీగా డ్రగ్స్, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 13 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెట్వర్క్ తో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి.. దేశంలోని ఏయే రాష్ట్రాలకు ఈ నెట్వర్క్ వ్యాపించింది వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా పెద్ద స్థాయి సరఫరాదారులు, తయారీదారులు, పంపిణీదారుల నెట్వర్క్ ను ఛేదించామని తెలిపారు పోలీసులు.
మేడ్చల్ లోని ఈ ఫ్యాక్టరీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్న విషయం తెలుసుకొని పోలీసులు సైతం అవాక్కయ్యారు. ఈ క్రమంలో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.