13ఏళ్లకే పెళ్లి.. ఆరు నెలల్లో 400 మంది రేప్

13ఏళ్లకే పెళ్లి.. ఆరు నెలల్లో 400 మంది రేప్

సమాజంలో ఆడ బిడ్డలకు రక్షణ కరువవుతోంది. నిత్యం ఎక్కడో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ జిల్లాలోని బీడ్ నగరంలో ఓ మైనర్ బాలిక (17)పై జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా ప్రపంచానికి తెలిసింది. పదమూడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు బాల్య వివాహం చేసి పంపేశారు. ఆ కట్టుకున్న వాడు చిన్న పిల్ల అన్న కనికరం లేకుండా ఆమెను వేధింపులకు గురి చేశాడు. మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. దీంతో అక్కడ నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ అక్కడ నిరాదరణకు గురైంది. కలలో కూడా ఆమె ఊహించని కష్టాలు ఆమెను చుట్టుముట్టాయి. ఇక చేసేది లేక అక్కడి నుంచి కూడా బయటపడి.. ఒక బస్టాండ్‌లో అనాథలా జీవిస్తూ వచ్చిన ఆమెపై ఎవరూ కనికరం చూపలేదు. తోటి మనిషిగా చేతనైన సాయం చేయాల్సిందిపోయి.. ఆమె నిర్దయ స్థితిని ఆసరాగా తీసుకుని గడిచిన ఆరు నెలల్లో దాదాపు 400 మంది ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఓ ఎన్జీవో ఆ బాలికను రక్షించి ఆశ్రయం కల్పించి.. కౌన్సిలింగ్‌ చేయడంతో ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కన్న తండ్రి కూడా వదల్లేదు

వరుస అకృత్యాలతో మనో ధైర్యం కోల్పోయి.. బీడ్‌లోని అంబజోగై బస్టాండ్‌లో ఉన్న ఆ బాలికను నవంబర్ 8న ఒక స్వచ్ఛంద సంస్థ కాపాడి ఆశ్రయం కల్పించింది. నెమ్మదిగా వాళ్లు ఇచ్చిన ధైర్యంతో కాస్త తేరుకుని తనపై జరిగిన దాడుల గురించి వివరించింది. దీంతో ఆ ఎన్జీవో సహకారంతో నవంబర్ 12న పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. దీంతో వాళ్లు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఆ బాలిక తండ్రి, భర్త కూడా ఉన్నారు. తనకు పదమూడేళ్ల వయసులో పెండ్లయిన తర్వాత భర్త వేధింపులకు గురిచేశాడని, హ్యూమన్ ట్రాఫికింగ్‌కు కూడా పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు వివరించింది. భర్త దగ్గర జరిగిన అకృత్యాలను తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయానని, అక్కడకు వెళ్లిన తర్వాత కూడా తనకు రక్షణ దొరకలేదని చెప్పింది. తన తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడని, దీంతో కొద్ది రోజుల తర్వాత పుట్టింటి నుంచి కూడా పారిపోవాల్సి వచ్చిందని తెలిపింది. ఈ ఘటనపై స్పందించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఏఎస్పీ కవిత నేర్కర్.. ఆ బాలికను ఎన్జీవో రక్షించిన తర్వాత పోలీస్ స్టేషన్‌ వరకూ వచ్చిందన్నారు. రేప్, హ్యూమన్ ట్రాఫికింగ్ సహా పలు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె చెప్పారు.

కాపాడాల్సిన పోలీసులే..

పుట్టింటిలో కూడా బాధిత బాలికకు రక్షణ లేకపోవడంతో అక్కడి నుంచి కూడా ఆమె బయటపడి.. మే నెల నుంచి ఒక బస్టాండ్‌లో ఉంటూ వచ్చింది. అక్కడ ఒంటరిగా, దయనీయ స్థితిలో ఉన్న ఆమెను చూసి సాయం చేయాల్సిన తోటి వాళ్లెవరూ ఆ ప్రయత్నం చేయలేదు. పైగా ఆమెను కొంత మంది తమ కర్కశ కోరికలకు బలి చేశారు. గడిచిన ఆరు నెలల్లోనే దాదాపు 400 మంది ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారని చెబుతోంది. అయితే సమాజంలో నేరం జరగకుండా చూడాల్సిన పోలీసులు కూడా ఇద్దరు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొంది. ఈ ఘటనపై తమ పోలీసు బృందం లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తోందని, ఆమె చెప్పిన వాటిపై లోతుగా పరిశీలించి వెరిఫై చేస్తున్నామని బీడ్ ఎస్పీ ఆర్‌‌. రాజా చెప్పారు.