మహారాష్ట్రలో నమోదైన ఫస్ట్ జికా వైరస్ కేసు

మహారాష్ట్రలో నమోదైన ఫస్ట్ జికా వైరస్ కేసు

కరోనా కేసులతో, భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న మహారాష్ట్రలో మరో వైరస్ వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో తాజాగా ఫస్ట్ జికా వైరస్ కేసు నమోదైంది. పూణే జిల్లాలోని పురందర్ మండలం బెల్సార్ గ్రామానికి చెందిన 50 ఏళ్ల వృద్ధురాలికి జికా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సదరు మహిళకు చికన్ గున్యా కూడా సోకిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటుందని చెప్పారు. అయితే ఆమె కుటుంబసభ్యులకు మాత్రం ఎలాంటి లక్షణాలు లేవని చెప్పారు. జులై నుంచి గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న వారి కేసులు పెరుగుతున్నాయి. దాంతో 5 శాంపిల్స్ పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా.. అందులో మూడు శాంపిల్స్‌కు చికన్ గున్యా పాజిటివ్ వచ్చింది. తర్వాత వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు చెందిన బృందం బెల్సార్ విలేజ్‌ను సందర్శించి.. మొత్తం 41 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్టులు చేసింది. వారిలో 25 మందికి చికెన్ గున్యా పాజిటివ్ రాగా... ముగ్గురికి డెంగ్యూ, ఒకరికి జికా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ బృందం ఇచ్చిన సమాచారంతో క్విక్ రెస్పాన్స్ టీం గ్రామానికి చేరుకొని స్థానికులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది.