భద్రాచలం, వెలుగు : మావోయిస్టులకు సంబంధించిన ఆయుధ ఫ్యాక్టరీని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన సీ60 బలగాలు, చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాకు చెందిన డీఆర్‌జీ, బీడీఎస్ బలగాలు సంయుక్తంగా గురువారం కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో గడ్చిరోలి జిల్లా కాకూర్ పోలీస్‌స్టేషన్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో మావోయిస్టులు నడుపుతున్న ఆయుధ తయారీ ఫ్యాక్టరీని గుర్తించారు. ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు, బీజీఎల్ లాంచర్లు, తుపాకులు, మందుపాతరలు, ఐఈడీలు, ఆయుధాలను తయారు చేసే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని గడ్చిరోలి జిల్లా కేంద్రానికి తరలించారు.
