కేసీఆర్ వల్లే బడులకు మహర్దశ : మంత్రులు, ఎమ్మెల్యేలు

కేసీఆర్ వల్లే బడులకు మహర్దశ : మంత్రులు, ఎమ్మెల్యేలు

వెలుగు నెట్ వర్క్: సీఎం కేసీఆర్ వల్లే ప్రభుత్వ బడులకు మహర్దశ వచ్చిందని మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం వారు ప్రారంభించారు.  

  • జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లిలో ఎమ్మెల్యే రాజయ్య ‘మన ఊరు–మన బడి’ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. చిన్నతనంలో చదువు ఆపి, బర్లు కాచేందుకు వెళ్తే.. ఓ టీచర్ ప్రోత్సాహంతోనే చదువుకొని డాక్టర్ అయ్యానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు.
  • ములుగు జిల్లా గోవిందరావుపేట మండలకేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు. రూ.50.60లక్షలతో ముస్తాబు చేసిన ప్రభుత్వ బడిని ప్రారంభించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్​ఆలం, ఐటీడీఏ పీవో అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
  • మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేణి ప్రభుత్వ బడిలో అభివృద్ధి పనుల్ని ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. పైసా ఖర్చు లేకుండా సొంతూరులోనే నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు.
  • హనుమకొండ లష్కర్ బజార్ ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు – మన బస్తీ’ కింద రూ.50లక్షలతో అభివృద్ధి పనులు చేయగా.. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ వాటిని ప్రారంభించారు. మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, అడిషనల్​ కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ డీఈవో అబ్దుల్ హై తదితరులున్నారు.
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడు ప్రభుత్వ బడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. రూ.21లక్షలతో స్కూల్​లో డిజిటల్ క్లాసులు, అదనపు గదులు, కిచెన్ షెడ్, కాంపౌండ్ వాల్, టాయిలెట్లు వంటి వాటిని నిర్మించామన్నారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మణ్ తండాలోనూ మంత్రి ‘మన ఊరు మన బడి’ పనుల్ని ప్రారంభించారు. అనంతరం పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మహా శివరాత్రి వాల్ పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జనగామ కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులున్నారు.
  • కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడుల్లో విద్య అందుతోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల ప్రభుత్వ స్కూల్​లో ‘మన ఊరు–మన బడి’ పనుల్ని కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు. ఈ బడిలో రూ.10లక్షలతో తరగతి గదుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సుందీకరణ పనులు చేపట్టామన్నారు.