మహా శివరాత్రికి శ్రీశైలం ముస్తాబు.. శ్రీగిరిపై నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

మహా శివరాత్రికి శ్రీశైలం ముస్తాబు.. శ్రీగిరిపై నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం, వెలుగు: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి  ప్రారంభం కానున్నాయి.11 రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవాల కోసం ఈవో డి.పెద్దిరాజు ఆధ్వర్యంలో దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా 2న భృంగి వాహన సేవ,3న హంస,4న మయూర,5న రావణ,6న పుష్ప పల్లకీ సేవ,7న గజవాహన, 8న నంది వాహనసేవ,9న రథోత్సవం,10న ధ్వజారోహణ,11న అశ్వవాహన సేవ పుష్పోత్సవం, శయనోత్సవం ఉంటాయి. 8న మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు ప్రభోత్సవం, 10 గంటలకు లింగోద్భవకాల మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, పాగాలంకరణ, 12గంటలకు భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల లీలా కల్యాణ మహోత్సవం జరుగుతుంది. 9న రాత్రి 8గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులకు అనుమతిస్తామని ఈవో తెలిపారు. శివ దీక్ష చేపట్టిన ఇరుముడి స్వాములకు శుక్రవారం నుంచి 5వ తేదీ వరకే స్వామివారి స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అన్ని అర్జిత సేవలను పూర్తిగా ఆపేస్తున్నట్టు చెప్పారు.